
ఇంటర్నెట్‌డెస్క్: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సోదరుడు షాహిద్ అక్తర్ అంత్యక్రియల్లో లష్కరే తయ్యిబా ఉగ్రవాదులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. వారిలో పహల్గాం ఉగ్రదాడి సూత్రధారి ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. షోయబ్ సోదరుడు షాహిద్ అంత్యక్రియలు ఇస్లామాబాద్‌లో జరిగాయి. భారత్‌లో పలు ఉగ్రదాడులకు కారకులైన లష్కరే తయ్యిబా ఉగ్రవాదులు హాజరయ్యారు. వారిలో లష్కరే డిప్యూటీ చీఫ్, పహల్గాం మాస్టర్‌మైండ్ (Pahalgam mastermind) సైఫుల్లా కసూరీ కూడా ఉన్నాడు. అతడితో పాటు లష్కరే రాజకీయ విభాగం పీఎంఎంఎల్ ప్రెసిడెంట్ ఇనామ్ ఉర్ రెహ్మాన్ హాజరయ్యాడు. ఐరాస ప్రకటిత ఉగ్రవాది హఫీజ్ సయీద్.. లష్కరేపై ఉన్న నిషేధాలను తప్పించుకుని తిరిగేందుకు పీఎంఎంఎల్‌ను ఏర్పాటు చేశాడు. అది 2024 పాకిస్థాన్ ఎన్నికల్లో పోటీ చేసింది. భారత వ్యతిరేక శక్తులకు పాకిస్థాన్ స్వర్గధామంగా ఉందని, ఉగ్రవాదులు ఎలాంటి ఆంక్షలు లేకుండా బహిరంగంగా తిరుగుతున్నారని ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి. కసూరీ ఇలా బహిరంగ కార్యక్రమంలో కనిపించడంతో ఈ ఆరోపణలు మరోసారి నిజమయ్యాయి. అలాగే పాక్‌లోని కీలక వ్యక్తులపై ఉగ్ర సంస్థల ప్రభావాన్ని ఈ ఘటన వెల్లడి చేస్తోంది. 2011లో క్రికెట్ నుంచి రిటైర్ అయిన షోయబ్.. ప్రస్తుతం వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి వెనుక పాక్ లష్కరే (ఎల్‌ఈటీ) కమాండర్ ఖలీద్ పేరు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. లష్కరే సంస్థలో ఖలీద్ చాలా కీలక వ్యక్తి. అతడి అసలు పేరు సైఫుల్లా కసూరీ. పహల్గాం దాడి తర్వాత అతడు చేసిన భారత వ్యతిరేక వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. 2025 ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు