
వెనెజువెలాను వణికించిన జంట భూకంపాల విధ్వంసం రోజురోజుకూ భయానకంగా మారుతోంది. నాలుగు రోజులు గడిచినా శిథిలాల కింద చిక్కుకున్న వేలాది మంది కోసం సహాయక బృందాలు ఇంకా గాలిస్తూనే ఉన్నాయి. ఇదే సమయంలో వరుస ఆఫ్టర్‌షాక్‌లు(వరుస ప్రకంపనలు.. తాజాగా 4.9 తీవ్రత) నమోదవుతుండటంతో బాధితుల్లో భయం మరింత పెరుగుతోంది. ఇప్పటివరకు మృతుల సంఖ్య 920కి చేరగా, మరో 50 వేల మందికిపైగా ఆచూకీ తెలియడం లేదని నివేదికలు చెబుతున్నాయి. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం సాయంత్రం కేవలం ఒక్క నిమిషం వ్యవధిలో.. రిక్టర్‌స్కేల్‌పై 7.2, 7.5 తీవ్రతతో సంభవించిన రెండు భారీ భూకంపాలు ఉత్తర వెనెజువెలాను అతలాకుతలం చేశాయి. రాజధాని కారకాస్ సమీపంలోని తీరప్రాంత నగరం లా గ్వైరా అత్యంత తీవ్రంగా దెబ్బతింది. భారీ అపార్ట్‌మెంట్లు, వాణిజ్య భవనాలు క్షణాల్లో నేలమట్టమయ్యాయి. అనేక ప్రాంతాల్లో శిథిలాల కిందే వందలాది మంది చిక్కుకుపోయినట్లు అధికారులు చెబుతున్నారు. సహాయక చర్యలు మాత్రం ఆశించిన వేగంతో సాగడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలాచోట్ల భారీ యంత్రాలు లేకపోవడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు, వాలంటీర్లే చేతులతో శిథిలాలను తొలగిస్తూ తమ ఆత్మీయుల కోసం వెతుకుతున్నారు. ఐదు నెలల చిన్నారి గల్లంతైందంటూ ఓ తల్లి కన్నీరుమున్నీరవుతుండగా, ప్రభుత్వ సహాయం కనిపించడం లేదంటూ మరో బాధితురాలు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అధికారికంగా.. ఇప్పటివరకు 920 మంది మృతి చెందగా, 3,360 మందికి పైగా గాయపడ్డారు. అయితే మరో 50 వేల మందికిపైగా ఆచూకీ తెలియడం లేదని లోకల్ మీడియా కథనాలు, పలు నివేదికల ఆధారంగా ఐక్యరాజ్యసమితి చెప్తున్నాయి. శిథిలాల కింద ఇంకా 172 మంది చిక్కుకుపోయినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే.. గణాంకాల విషయంలో ప్రభుత్వం దాపరికం ప్రదర్శిస్తుండడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రజల ఆగ్రహం తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెస్‌పై కూడా వ్యక్తమైంది