
ప్రధాని పదవికి కీర్ స్టార్మర్ రాజీనామా. సొంత పార్టీలో పెరిగిన అసంతృప్తి. ఆండీ బర్న్‌హామ్ కొత్త ప్రధాని అయ్యే అవకాశం. Keir Starmer: యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) రాజకీయాల్లో మరోసారి పెను సంచలనం నమోదైంది. లేబర్ పార్టీకి 2024 సాధారణ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయాన్ని అందించి, ప్రధాని పీఠాన్ని అధిష్టించిన కీర్ స్టార్మర్(Keir Starmer) తన పదవికి అధికారికంగా రాజీనామా ప్రకటించారు. అధికారం చేపట్టిన రెండేళ్లు కూడా పూర్తికాకముందే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం బ్రిటన్ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. గత దశాబ్ద కాలంగా యూకేలో సాగుతున్న రాజకీయ అనిశ్చితికి ఈ పరిణామం అద్దం పడుతోంది. Neet Re Exam: నీట్ రీ ఎగ్జామ్ పేపర్ లీక్.. వీడియో వైరల్.. క్లారిటీ ఇచ్చిన NTA గత కొన్ని వారాలుగా లేబర్ పార్టీలో అంతర్గత అసంతృప్తి తీవ్రస్థాయికి చేరడం, స్థానిక ఎన్నికల్లో ఎదురైన పరాజయాలు స్టార్మర్ పదవికి ముప్పు తెచ్చిపెట్టాయి. పలువురు సీనియర్ నేతల నుంచి వచ్చిన తీవ్ర ఒత్తిడి, సొంత పార్టీలోనే నాయకత్వ మార్పుపై డిమాండ్లు పెరగడంతో ఆయన చివరకు దిగిరాక తప్పలేదు. అయితే, పార్టీ కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు ఆయనే ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతారు. సెప్టెంబర్‌లో పార్లమెంట్ తిరిగి ప్రారంభమయ్యే నాటికి కొత్త ప్రధాని ఎంపిక ప్రక్రియ పూర్తి కానుంది. ప్రస్తుతం స్టార్మర్ వారసుడిగా లేబర్ పార్టీ అగ్రనేత ఆండీ బర్న్‌హామ్ పేరు బ్రిటన్ రాజకీయాల్లో బలంగా వినిపిస్తోంది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన బర్న్‌హామ్, మెజారిటీ లేబర్ ఎంపీల మద్దతు కూడగట్టడంలో ముందంజలో ఉన్నారు. స్టార్మర్ అకస్మాత్తుగా తప్పుకోవడం వల్ల లేబర్ పార్టీ భవిష్యత్తుతో పాటు, యూకే రాజకీయ దిశ మరియు ఆర్థిక విధానాలపై ఎలాంటి ప్రభావం పడబోతోందనే అంశంపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది