
తిరిగి భారత పౌరసత్వం ఇప్పించాలన్న వృద్ధురాలు ఆమె వినతిపై జీఏడీకి బాపట్ల కలెక్టర్ నివేదిక ఈనాడు, అమరావతి: అమెరికా పౌరసత్వాన్ని వదులుకుని, భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్న వృద్ధురాలు కొండ్రగుంట మహాలక్ష్మమ్మ విజ్ఞప్తిపై బాపట్ల జిల్లా కలెక్టర్ వి.వినోద్‌కుమార్ శుక్రవారం సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)కి నివేదికను పంపించారు. అక్కడ పరిశీలన అనంతరం కేంద్ర హోం శాఖకు వెళ్లనుంది. జన్మభూమిలోనే కన్నుమూయాలని ఉందని, త్వరగా తనకు భారత పౌరసత్వాన్ని ఇప్పించాలంటూ బాపట్ల జిల్లా చినగంజాం మండలం చింతగుంపల గ్రామానికి చెందిన మహాలక్ష్మమ్మ ఆన్‌లైన్ ద్వారా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై బాపట్ల కలెక్టర్ ఈ నెల 23న తన కార్యాలయంలో పరిశీలించి విచారించారు. విచారణకు హాజరైన మహాలక్ష్మమ్మ భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తానని, చట్టానికి లోబడి ఉంటానని కలెక్టర్ వద్ద ప్రమాణం చేశారు. వృద్ధాప్యంలో ఉన్న తనకు స్వదేశంలో జీవించడానికి చట్టప్రకారం హక్కు కల్పించాలని విన్నవించారు. దీనిపై విచారణ పూర్తి చేసిన కలెక్టర్.. జీఏడీకి నివేదిక పంపించారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు