
అర్ధరాత్రి దాటాక రాంబాబుగాడి రూమ్ ముందు నుంచి వెళ్తుంటే వాడేదో రాసుకుంటూ కనిపించాడు. టేబుల్ మీద ఏదో ముగ్గులాంటిది వేసి ఉంది. ఆ బల్లమీదే నల్లకోడి బొమ్మా, నాలుగు నిమ్మకాయల్లాంటివేవో ఉన్నాయి. ‘‘ఏంట్రా ఇదంతా?’’ అడిగా. ‘‘నీకు తెలుసుగా... ఈ మధ్య నేను తాంత్రిక సాధనతో దెయ్యాల లోకంలోకి వెళ్లి... ‘‘దెయ్యాలూ... వాటికొచ్చే జ్వరాలూ – వైద్యవిధానాలు’’ అనే సబ్జెక్టు మీద పరిశోధన చేస్తున్నానని. ఆ థీసీసు రాసుకుంటున్నా’’ అన్నాడు రాంబాబు. ‘‘ఏం తేలింది నీ అధ్యయనంలో?’’ ‘‘చాలా ఆసక్తికరమైన విషయాలు తెలిశాయిరా. దెయ్యాలకు జ్వరం గట్రా వచ్చాయనుకో. అక్కడ ‘పారా (నార్మల్) సిటమాల్’ అనే టాబ్లెట్లు వాడతారు. అన్నట్టు దాని బ్రాండ్ ‘డెవిలో–750’ అనేది చాలా ఫేమస్ బ్రాండు అక్కడ’’ ‘‘దెయ్యాలకు జ్వరం రావడమేంట్రా?’’ అయోమయంగా అడిగా. ‘‘ఎందుకు రాదూ. చేత‘బడి’ అనే వాళ్ల నర్సరీ స్కూలెగ్గొట్టి పిల్లదెయ్యాలుగానీ శ్మశానంలో చితిమంటల దగ్గర ఎక్కువ సేపు తిరిగాయనుకో. ఆ ఉష్ణోగ్రత వల్ల దెయ్యపిల్లలకు జ్వరం వస్తుందనేది ప్రేతలోకంలోని ఓ పిచ్చి నమ్మకం. మన దగ్గర వడదెబ్బలాగే... ఈ తరహా జ్వరాన్ని వాళ్లు ‘చితిదెబ్బ’ అని పిలుస్తారు. అక్కడి భూతమాంత్రికులు మాత్రం దీన్ని ‘కాష్ట ఘాతం–ప్రేత పిత్త పైత్య ప్రకోపం’ అంటారు’’ ‘‘ఇంకా’’ ఆసక్తిగా అనిపించి కాస్త రెట్టించి అడిగా. ‘‘ఇంకా బోల్డన్ని విశేషాలు ఉన్నాయిరా. దెయ్యాల లోకంలో ఈమధ్యే ‘డరోనా’ అనే వైరస్ వ్యాపించినప్పుడు దెయ్యాలన్నీ ఈ ‘డెవిలో–750’ని చాలా ఎక్కువగా వాడేశాయి. అన్నట్టు... ఈ టాబ్లెట్లూ గట్రా వాడటానికి మనలోకంలాగే అక్కడ కూడా చాలా రూల్సూ అవీ ఉన్నాయి. ఫరెగ్జాంపుల్ టాబ్లెట్లు వేసుకునేటప్పుడు గోరువెచ్చని రక్తంతోనే వేసుకోవాలట. మరీ చల్లటి రక్తమైతే జలుబు చేస్తుందేమోనన్నది వాళ్ల భయం. అంతేకాదు... మనలోకంలోలాగే దెయ్యాలకు జలుబు చేస్తే ‘నల్లకోడి చికెన్ సూప్’ తాగితే తగ్గిపోతుందన్నది భూతలోకంలోని ఓ గట్టి నమ్మకం’’ ‘‘గోరువెచ్చటి రక్తమా? మరి కొంతమంది నీ వేడి రక్తం తాగుతా అంటారు కదా