
ఓవైపు హెచ్చరికలు, మరోవైపు శాంతి చర్చలు.. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య అమెరికా-ఇరాన్ సంబంధాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. స్విట్జర్లాండ్‌లో జరిగిన తొలి విడత చర్చల అనంతరం 60 రోజుల్లో తుది శాంతి ఒప్పందానికి చేరుకోవాలనే రోడ్‌మ్యాప్‌ను ఇరు దేశాలు ఆమోదించాయి. ఖతర్, పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో.. ఇందుకు ఇరు దేశాల ప్రతినిధులు చేతులు కలపడం గమనార్హం. స్విట్జర్లాండ్‌లోని బర్గెన్‌స్టాక్ రిసార్ట్‌లో ఆదివారం జరిగిన అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు కీలక మలుపు తిరిగాయి. ఖతర్, పాకిస్తాన్ విడుదల చేసిన సంయుక్త ప్రకటన ప్రకారం.. వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య నెలకొన్న ప్రధాన విభేదాలను పరిష్కరించేందుకు 60 రోజుల కార్యాచరణ ప్రణాళిక (రోడ్‌మ్యాప్)పై ఇరు దేశాలు అంగీకరించాయి. 'ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందం' (Islamabad MoU) కింద జరిగిన తొలి విడత చర్చలు సానుకూల, నిర్మాణాత్మక వాతావరణంలో జరిగాయని మధ్యవర్తి దేశాలు పేర్కొన్నాయి. తుది ఒప్పందానికి అవసరమైన అమలు విధానాలు, పర్యవేక్షణ వ్యవస్థ, నిబంధనల అమలు, పరస్పర బాధ్యతలపై ఇక నుంచి సాంకేతిక స్థాయి చర్చలు వెంటనే ప్రారంభం కానున్నాయి. చర్చల్లో మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. అపార్థాలు, ఉద్రిక్తతలు, అనుకోని ఘర్షణలు నివారించేందుకు అమెరికా-ఇరాన్ మధ్య నేరుగా సమాచార మార్పిడి వ్యవస్థ (డైరెక్ట్ కమ్యూనికేషన్ ఛానెల్) ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. చర్చల కాలంలో ఏవైనా సంఘటనలు చోటుచేసుకున్నా వాటిని వెంటనే పరిష్కరించేలా ఈ వ్యవస్థ పనిచేయనుంది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకల సురక్షిత రాకపోకల అంశం కూడా ఈ చర్చల్లో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. హర్ముజ్‌లో భద్రత, నౌకాయాన స్వేచ్ఛను కొనసాగించేందుకు ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేయాలని అంగీకరించారు. అలాగే రాజకీయ స్థాయిలో మొత్తం మధ్యవర్తిత్వ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీకి ప్రధాన చర్చాకర్తలు తరచూ నివేదికలు సమర్పిస్తారు. అణు కార్యక్రమం, ఆర్థిక ఆంక్షలు, పర్యవేక్షణ విధానాలు, వివాద పరిష్కార వ్యవస్థ వంటి