
కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో బంగారం గని ప్రాజెక్టు (Gold mine project)ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ప్రారంభించారు. అనంతరం రెండో యÖనిట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జొన్నగిరి ప్రాజెక్టుకు జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, దక్కన్ గోల్డ్‌మైన్స్ లిమిటెడ్ సంస్థలు ఇప్పటి వరకు రూ.405 కోట్లు వెచ్చించాయి. ప్రయోగాత్మకంగా చేసిన ఉత్పత్తి ప్రక్రియ విజయవంతం కావడంతో వాణిజ్యపరంగా జంగారం ఉత్పత్తి చేసే ప్రక్రియను సీఎం ప్రారంభించారు. ప్రైవేటు రంగంలో బంగారం గనుల తవ్వకం, ఉత్పత్తి చేసే ప్రక్రియ ప్రారంభం కావడం దేశంలోనే ఇది మొట్టమొదటిసారి. ప్రపంచంలో బంగారం గనులు, ఉత్పత్తి కేంద్రాలు ఉన్న ప్రాంతాల్లో ఒకటిగా జొన్నగిరి (Jonnagiri)కి అంతర్జాతీయ గుర్తింపు లభించనుంది. ఏటా రెండు టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేసేలా జియోమైసూర్ సంస్థ (GeoMysore Company) ప్రణాళికలు రచించింది. ఇక్కడ 700 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఉత్పత్తి చేసిన బంగారం విలువపై నాలుగుశాతం రాయల్టీ లభించనుంది. తొలి ఏడాది 500 కేజీల బంగారాన్ని ఉత్పత్తి చేయనున్న నేపథ్యంలో సుమారు రూ.57 కోట్లు రాయల్టీ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం సమకూరనుంది