
శ్రీశైల దేవస్థానం పరిపాలనా విభాగంలో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది కోసం రూ.60 కోట్లతో నిర్మించిన 297 అత్యాధునిక వసతులతో కూడిన గృహాలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని.. శ్రీశైలంలో రూ.60 కోట్లతో నిర్మాణం, త్వరలోనే ప్రారంభం: మంత్రి ఆనం శ్రీశైలం, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల దేవస్థానం పరిపాలనా విభాగంలో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది కోసం రూ.60 కోట్లతో నిర్మించిన 297 అత్యాధునిక వసతులతో కూడిన గృహాలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. శనివారం ఆయన సున్నిపెంటలోని స్టాఫ్ క్వార్టర్స్ నూతన భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సిబ్బంది కోసం నిర్మించిన బహుళ అంతస్థుల భవన సముదాయాన్ని త్వరలోనే అందుబాటులోకి తెస్తామన్నారు. మరో రూ.10 కోట్లతో అంతర్గత రహదారులను కూడా నిర్మిస్తామన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే దేవస్థానం పరిపాలన సౌలభ్యానికి అనుగుణంగా క్షేత్రస్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు ఒకే చోట ఉండేలా బహుళ అంతస్థులను నిర్మించినట్టు తెలిపారు. ఈ భవనాలకు అవసరమైన అంతర్గత రోడ్లు, మంచినీరు, విద్యుత్, తదితర వసతులను కల్పించిన తర్వాత 297 గృహాలకు సిబ్బందిని తరలించే ప్రక్రియ చేపడతామని వెల్లడించారు. కాగా, శ్రీశైలం పర్యటనకు వచ్చిన రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శనివారం ఉదయం మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకున్నారు