
Government School : ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టిసారించారు. సర్కార్ బడుల్లో మెరుగైన వసతి సౌకర్యాలను కల్పిస్తుండటంతోపాటు.. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేలా చర్యలు చేపట్టారు. అంతేకాక.. విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనాన్ని అందిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను మరింత పెంచేలా రేవంత్ రెడ్డి సర్కార్ అన్ని ప్రయత్నాలను చేస్తోంది. దీంతో ప్రభుత్వ బడుల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే, కొన్ని గ్రామాల్లోని ప్రభుత్వ బడుల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపకపోవటంతో అక్కడి ఉపాధ్యాయులకు ఇబ్బందికరంగా మారింది. ఇలాంటి పరిస్థితికి చెక్ పెట్టేందుకు ఓ ఉపాధ్యాయుడు వినూత్న పంథాను ఎంచుకున్నాడు. నిర్మల్ జిల్లా బైంసా మండలంలో లింగా ప్రాథమిక పాఠశాల ఎస్టీజీ ఉపాధ్యాయుడు బిజ్జూర్వార్ సాయినాథ్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు తగ్గుతున్న నేపథ్యంలో ఆయన తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బిజ్జూర్వార్ సాయినాథ్ లింగా గ్రామంలో టీచర్‌గా పనిచేస్తున్నాడు. గతంలో సరిపడా విద్యార్థులతో నడిచిన పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గింది. దీంతో సాయినాథ్‌ను ఎంఈఓ ఇతర పాఠశాలకు డిప్యుటేషన్ పై పంపించారు. అయితే, ప్రతి గ్రామంలోనూ ప్రభుత్వ పాఠశాల ఉండి తీరాల్సిందేనని విద్యాశాఖ మంత్రి బాధ్యతలను నిర్వర్తిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి సంకల్పించి.. ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం సాయినాథ్ ప్రస్తుత విద్యా సంవత్సరం జూన్ 15న తిరిగి లింగా ప్రాథమిక పాఠశాలలో విధుల్లో చేరాడు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచాలనే లక్ష్యంతో సాయినాథ్ గ్రామంలోని ప్రజాప్రతినిధులు, గ్రామస్తులతో కలిసి ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పిస్తే వారికి నాణ్యమైన విద్య అందిస్తామని తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ముగ్గురు విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలో చేర్పించేందుకు ముందుకు వచ్చారు