
ఇంటర్నెట్‌డెస్క్: ప్రధాని మోదీకి (PM Modi) మరో అరుదైన గౌరవ పురస్కారం లభించింది. సీషెల్స్ దేశ అత్యున్నత ‘గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్’ (Guardian of the Blue Horizon)పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. ఆ దేశ అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మినీ ఆయనకు అవార్డు అందజేశారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం, సుస్థిర అభివృద్ధి సాధించడంలో ప్రపంచ దేశాలకు నాయకత్వం వహిస్తున్నందుకుగానూ సీషెల్స్ ఈ పురస్కారాన్ని ప్రదానం చేసింది. దీనిపై ప్రధాని మోదీ స్పందిస్తూ సీషెల్స్ దేశ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తున్న భారత ప్రజలందరికీ ఈ అవార్డును అంకితం చేస్తున్నట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు. ‘‘ఈ అవార్డును అత్యంత గౌరవంగా స్వీకరిస్తున్నా. వాతావరణ మార్పులతో సతమతమవుతూ, పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్న అన్ని దేశాల ప్రజలకు ఈ పురస్కారాన్ని అంకితం చేస్తున్నా. అందరూ ఏకమై పర్యావరణ పరిరక్షణకు పూనుకోవాల్సిన అవసరం ఉంది. మన గ్రహాన్ని మరింత పచ్చగా, సుస్థిరంగా మార్చేందుకు భారత్ సిద్ధంగా ఉంది. కానీ, అందుకు అన్ని దేశాలూ ముందుకు రావాలి. అప్పుడే అది సాధ్యపడుతుంది’’ అని మోదీ పేర్కొన్నారు. వాతావరణ పరిరక్షణ అంశంలో ప్రధాని మోదీకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం ఇదే తొలిసారి కాదు. ఆహార భద్రత, వ్యవసాయంలో తీసుకొస్తున్న మార్పులు, సుస్థిర అభివృద్ధి తదితర అంశాల్లో ఆయన చేసిన కృషికి గానూ మే 2026లో ప్రపంచ వ్యవసాయ, ఆహార సంస్థ (ఎఫ్‌ఏఓ) ఆయనకు ‘అగ్రికోలా మెడల్’ను బహూకరించింది. 2018లో సుస్థిర ఆర్థికాభివృద్ధి, ప్రపంచ సహకారం, సమ్మిళిత అభివృద్ధి రంగాల్లో ఆయన సేవలకుగానూ సియోల్ శాంతి బహుమతి వరించింది. అదే ఏడాది ఐక్యరాజ్యసమితి.. ‘ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్’ అవార్డుతో సత్కరించింది. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా