
మార్కాపురం: ప్రజల అండ ఉంటే కొండనైనా ఢీ కొట్టే శక్తి తనకు వస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. మార్కాపురంను ప్రత్యేక జిల్లాగా చేసి ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నామన్నారు. కిష్టంశెట్టిపల్లిలో పర్యటించిన ఆయన.. సంజీవని డిజిటల్ నెర్వ్ సెంటర్‌ను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.. ప్రజలు ఆనందంగా ఉండేందుకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తోందన్నారు. ‘‘ ప్రతి ఒక్కరి ఆరోగ్యం కోసం సంజీవని లాంటి వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. ఆగస్టు 15 నుంచి అన్ని జిల్లాల్లో సంజీవని అమలు చేస్తాం. యోగా, ధ్యానం వంటి మంచి అలవాట్లతో మీ ఆరోగ్యం.. మీ చేతుల్లోనే ఉంటుంది. పిల్లలకు పౌష్టికాహారం పెట్టాలి.. తాజా ఆహారం తీసుకోవాలి. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. వీలైనంత వరకు ఎరువులు తక్కువగా వాడాలి. యూరియా ఎక్కువ వేస్తే పంటను కొనేందుకు సిద్ధంగా లేరు. చాలా మంది ప్రకృతి సేద్యం వైపు అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలో 20 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యం చేస్తున్నారు. భవిష్యత్‌లో పెద్ద కుటుంబాలను ఆదరిస్తాం. ఇంటి కోసం, రేషన్ కార్డు కోసం పిల్లలు, తల్లిదండ్రుల నుంచి విడిపోతున్నారు. చాలా దేశాల్లో జనాభా తగ్గిపోతోంది. జనాభా పెరగాల్సిన అవసరం ఉంది. 40 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో దాని గురించి ఇప్పుడే ఆలోచిస్తాను. నా కంటే ఇన్నోవేషన్ తెచ్చేవారు ఎవరూ ఉండరు. ఇటీవల జెన్ జీ... జెన్ జీ మాట ఎక్కువగా వినిపిస్తోంది. నేనే అందరికంటే పెద్ద జెన్‌జీని. నా కంటే ఇన్నోవేటివ్‌గా ఆలోచించేవారు ఎవరూ ఉండరు. ఇన్నోవేషన్‌తో ముందుకు వస్తే అండగా ఉంటా. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి. వెలిగొండ ప్రాజెక్టు.. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు జీవనాడి. ఈ రెండు ప్రాజెక్టులను పూర్తి చేసి తీరుతాం. గొడ్డలి పార్టీకి మద్దతు ఇచ్చేవారు ఆత్మవిమర్శ చేసుకోవాలి. అమరావతిపై వైకాపా కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. అమరావతిని నంబర్ 1 నగరంగా, రాజధానిగా తీర్చిదిద్దుతాం