
సూర్య ప్రకాష్ జోశ్యుల Rating: 2.5 అనగనగా ఓ సుబ్బారావు అలియాస్ సుబ్బు (చంద్రహాస్). ఉద్యోగం, సద్యోగం లేనివాడు. తండ్రి నుంచి అప్పులను వారసత్వంగా అందుకున్న అదృష్టవంతుడు. దాంతో ఎలా బ్రతకాలిరా అని తలపట్టుకుంటే...స్నేహితుడు పండు "కొచ్చికి రా... ఏదో ఒక పని చూద్దాం" అని పిలుస్తాడు. దాంతో స్నేహమేరా జీవితం అనుకుంటూ కేరళలోని కొచ్చిలో వాలిపోతాడు. అక్కడ బోట్ హౌస్‌లో బస చేస్తూ, టాక్సీ డ్రైవర్‌గా రోజులు నెట్టుకొస్తుంటాడు. అలా జీవితం అర్దమయ్యి..కాకుండా నడుస్తున్న సమయంలో ఓ శుభ ముహూర్తాన అమెరికా నుంచి వైష్ణవి (లావణ్య) అనే అందమైన అమ్మాయి బిజినెస్ పని మీద కొచ్చిలో దిగుతుంది. నెల రోజుల పాటు తిరగడానికి సుబ్బు టాక్సీని బుక్ చేసుకుంటుంది. ఇక మనోడికి లాటరీ తగిలిన ఫీలింగ్. రోజూ ఆమెతో తిరుగుతూ, ఆమె నవ్వులకు అర్థాలు వెతుకుతూ, ఆమె మర్యాదను ప్రేమగా అపార్థం చేసుకుంటూ గాల్లో మేడలు కట్టడం మొదలుపెడతాడు. అమ్మాయి రెండు మాటలు బాగా మాట్లాడితే పెళ్లి కార్డు ప్రింట్ చేయించుకునే సగటు తెలుగు కుర్రాడు జాతికి చెందినవాడు కదా! అయితే ప్రేమ కథలకు ట్విస్ట్‌లు పెట్టడానికి విధి(అదే రైటర్) ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. అమెరికా నుంచే రోహిత్ అనే కుర్రాడు ఎంట్రీ ఇస్తాడు. అతడే వైష్ణవి కాబోయే భర్త అని తెలిసేసరికి, సుబ్బు ప్రేమ బుడగ సూదితో పొడిచిన బెలూన్‌లా టప్‌మని పేలిపోతుంది. అప్పుల బాధ ఒకవైపు... ప్రేమ బాధ మరోవైపు... జీవితమే తనను పనిగట్టుకుని మరీ ట్రోల్ చేస్తోందేమో అనుకునే పరిస్థితి. ఇంతలో కథ మరో టర్న్ తీసుకుంటుంది. ఒక రోజు రన్నింగ్ ట్రైన్‌లో నలుగురు దుండగులు ఓ అమ్మాయిని బయటకు తోసేయడానికి ప్రయత్నిస్తున్న దృశ్యం అనుకోకుండా వైష్ణవి సెల్‌ఫోన్‌లో రికార్డ్ అవుతుంది. సాధారణంగా మనలో చాలామంది వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేసి తమ బాధ్యత పూర్తయిందనుకుంటారు. కానీ వైష్ణవి అలా కాదు. "ఆ అమ్మాయికి ఏమైంది? ఎలా