
తిమూర్ పేరు వినగానే మధ్యయుగ ఆసియా చరిత్రలో రక్తపాతం, భయానక దండయాత్రలు, నగరాల నాశనం, సామూహిక హత్యలు గుర్తుకు వస్తాయి. తాను ఇస్లాం ధర్మరక్షకుడు , ‘జిహాద్ యోధుడు అని ప్రకటించుకుంటూనే, అపార ధనసంపద, రాజకీయ ప్రతిష్ఠ, సామ్రాజ్య విస్తరణ కోసం తిమూర్ నడిపిన యుద్ధాలు నరమేధాన్ని మిగిల్చి, రక్తచరిత్ర రాశాయి. తామర్లేన్ అని కూడా పిలిచే అతడు మధ్య ఆసియాకు చెందిన అత్యంత క్రూరుడిగా మిగిలిపోయాడు. ముఖ్యంగా 1398–99లో భారతదేశంపై చేసిన దండయాత్ర, ఢిల్లీ నగరంపై చేసిన దారుణ దాడి, భారత చరిత్రలో ఒక మలుపు. 1398లో అతను భారతదేశంపై దండయాత్ర చేపట్టాడు. ఈ దండయాత్ర భారత చరిత్రలో అత్యంత విధ్వంసకరమైన దాడులలో ఒకటి. 1330ల దశకంలో, నేటి ఉజ్బెకిస్తాన్ ప్రాంతంలోని కేశ్ పరిసరాల్లో తిమూర్ జన్నించాడు. 1370లో సమర్కండ్ కేంద్రంగా తిమురీ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. మధ్య ఆసియా, పర్షియా, ఇరాక్, కాక్కేసస్, రష్యా ప్రాంతాలపై వరుస దండయాత్రలు చేసి, గెంగిస్ ఖాన్ మాదిరి అందర్నీ భయభ్రాంతుల్ని చేసి తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. కఠిన సున్నీ ముస్లిం, ఇస్లాం పతాకధారి అని, తనను తాను ప్రకటించుకున్న తిమూర్, తన స్వీయ చరిత్ర గ్రంధం మల్‌ఫుజాత్ -ఐ- తిమూర్‌లో భారతదేశంపై దాడికి మతపరమైన కారణాలను కూడా ప్రస్తావించాడు. అతను తనను ఇస్లాం పరిరక్షకుడిగా చిత్రీకరించుకుంటూ, "అవిశ్వాసులపై జిహాద్" చేస్తున్నానని చెప్పుకున్నాడు. 14వ శతాబ్దం చివరికి ఢిల్లీని పాలిస్తున్న తుగ్లక్ వంశం తీవ్ర అంతర్గత కలహాలు, తిరుగుబాట్లు, ప్రాంతీయ విభజనలతో బలహీనపడింది. అప్పట్లో నాసిరుద్దీన్ మహ్మూద్ షా తుగ్లక్ పేరు మాత్రమే సుల్తాన్. అసలు అధికారాన్ని మల్లూ ఇక్బాల్ ఖాన్ వంటి అమీరులు వెలగబెట్టేవారు. సామంతులు స్వతంత్రంగా వ్యవహరిస్తూ, కేంద్రానికి కేవలం పేరుకే విధేయత చూపేవారు. అలాంటి సమయంలో తిమూర్ దృష్టి అప్పట్లో అత్యంత ధనిక నగరమైన ఢిల్లీపై పడింది. ఢిల్లీలో పన్నుల వసూళ్లు, వాణిజ్యం, బంగారం, రత్నాలు, హస్తకళల సంపద ఇవన్నీ త్రిమూర్‌ని ఆకర్షించాయి