
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన 80వ పుట్టిన రోజును ఘనంగా చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం అధ్యక్ష భవనంలో యూఎఫ్‌సీ (UFC) ‘కేజ్ ఫైట్’ను నిర్వహించనున్నారు. వైట్‌హౌస్ చరిత్రలోనే తొలిసారిగా ఇటువంటి కార్యక్రమం కోసం భారీ వేదికను ఏర్పాటు చేయడం విశేషం. ఆదివారం (జులై 14న) రాత్రి నిర్వహించే ఈ ఈవెంట్‌కు 60 మిలియన్ డాలర్లు (సుమారు రూ.500 కోట్లు) ఖర్చు చేయనున్నట్లు అంచనా. అమెరికా స్వాతంత్ర్య దినోత్సవాన్ని (జులై 4) పురస్కరించుకొని ఈ కార్యక్రమానికి ‘యూఎఫ్‌సీ ఫ్రీడమ్ 250’ అని పేరు పెట్టారు. యూఎఫ్‌సీ అంటే.. అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్‌షిప్. అధ్యక్షుడు ట్రంప్‌నకు ఈ పోటీలంటే ఎంతో ఇష్టం. గతంలో చాలా ఈవెంట్లను ప్రత్యక్షంగా వీక్షించారు. యూఎఫ్‌సీ సీఈవో డానా వైట్ (Dana White) కూడా ట్రంప్‌నకు సన్నిహితుడు. వీరి స్నేహానికి ప్రతీకగానే వైట్‌హౌస్‌లో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఏడాది కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఆదివారం రాత్రి జరిగే ఫ్రీడమ్ 250లో (UFC Freedom 250) పలు దేశాలకు చెందిన ప్రముఖ ఫైటర్లు తలపడనున్నారు. యూఎఫ్‌సీ ఫ్రీడమ్ 250 ఈవెంట్ కోసం వైట్‌హౌస్ సౌత్ లాన్ ముస్తాబైంది. ‘ది క్లా’ (The Claw) పేరుతో భారీ వేదికను రూపొందించారు. 92 అడుగుల ఎత్తు, 154 అడుగుల వెడల్పు, 600 టన్నుల భారీ స్థాయిలో తాత్కాలిక పైకప్పును నిర్మించారు. వేదిక మధ్యలో యూఎఫ్‌సీ ఆక్టాగాన్ (కేజ్)తోపాటు మూడు నుంచి నాలుగు వేల మంది అతిథులు కూర్చొని వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. వేలాది మంది సామాన్యులు చూసేందుకు వైట్‌హౌస్ బయట కూడా భారీ స్ర్కీన్‌లను పెట్టారు. అయితే, ఈఫిల్ టవర్ మాదిరిగా ఈ తాత్కాలిక నిర్మాణం శాశ్వతంగా ఉండిపోయే అవకాశం ఉందని ట్రంప్ చెప్పడం విశేషం. ట్రంప్ పుట్టినరోజు సందర్భంగా వైట్‌హౌస్‌లో యూఎఫ్‌సీ పోటీలు నిర్వహించడం స్థానికంగా తీవ్ర విమర్శలకు కారణమైంది. ప్రభుత్వ స్థలంలో నిబంధనలకు