
బూర్గంపహాడ్, జూన్ 22 : తన వ్యవసాయ పొలంలో వరి విత్తనాలు చల్లేందుకు వెళ్లి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతిచెందిన సంఘటన బూర్గంపహాడ్ మండల పరిధిలోని అంజనాపురంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. దీనికి సంబంధించి స్థానికులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... అంజనాపురం గ్రామానికి చెందిన సపావట్ శంకర్ (47) అదే గ్రామంలో మండల ప్రాథమిక పాఠశాలలో గణిత ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు. కొంతకాలం వరకు మోరంపల్లిబంజర్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసి ఇటీవల జరిగిన బదిలీల్లో స్వగ్రామంలోని ఎంపీపీఎస్‌కు బదిలీ అయ్యారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం మోరంపల్లిబంజర్లోని ఓ హోటల్లో అల్పాహారం చేసిన శంకర్ పాఠశాల ప్రారంభ సమయానికి సమయం ఉండటంతో వరినారు చల్లేందుకు విత్తనాలు తీసుకుని తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు. అయితే పొలంలో విత్తనాలు చల్లే క్రమంలో ఒక్కసారిగా తీవ్రమైన ఛాతినొప్పి రావడంతో అక్కడే ఆయన కుప్పకూలి పోయారుడు. స్థానికులు శంకర్ను ప్రథమచికిత్స నిమిత్తం మోరంపల్లిబంజర్ ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి భద్రాచలం తరలించగా అప్పటికే గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు