
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల సమీకరణాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. సార్వత్రిక ఎన్నికల అనంతర పరిణామాలను గమనిస్తే.. వైసీపీ కుల రాజకీయాలపై ఫోకస్ పెట్టిందని స్పష్టమౌతోంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు వైసీపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో మాజీ మంత్రి తోట త్రిమూర్తులు నేతృత్వంలో జరిగిన వైసీపీ కాపు సామాజిక వర్గాల నాయకుల సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పుట్టించింది. ఈ సమావేశంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో పాల్గొని భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఈ కాపు శంఖారావం వెనుక బలమైన రాజకీయ వ్యూహం దాగి ఉందని ప్రముఖ విశ్లేషకుడు భరద్వాజ అన్నారు. తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన కాపు సామాజికవర్గ పాకెట్ ను వేదికగా చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఆ సామాజిక వర్గ ఓట్లను ఏకీకృతం చేయాలన్న వ్యూహంతో వైసీపీ ముందుకు సాగుతున్నట్లు విశ్లేషించారు. ఉమ్మడి కోస్తా జిల్లాల్లో, ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గానికి అత్యంత బలమైన పట్టు ఉంది. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కమ్మ సామాజిక వర్గానికి ఎంతటి రాజకీయ, ఆర్థిక ప్రాబల్యం ఉందో, తూర్పుగోదావరిలో కాపులకు అంతటి శక్తి ఉంది. ఈ స్ట్రాంగ్ పాకెట్‌ను వేదికగా చేసుకుని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాపు ఓటు బ్యాంకును వైసీపీ వైపు ఏకీకృతం (Consolidate) చేయడమే కాపు శంఖారావం భేటీ ప్రధాన ఉద్దేశమని భరద్వాజ వివరించారు. గతంలో కాపు సామాజిక వర్గం కోసం పోరాడిన ముద్రగడ పద్మనాభం, హరిరామజోగయ్య వంటి సీనియర్ నేతలు వయోభారం, అనారోగ్య కారణాల వల్ల క్రియాశీల రాజకీయాలకు కొంత దూరంగా జరుగుతున్న తరుణంలో, తోట త్రిమూర్తులు వైసీపీ తరఫున ఈ కొత్త బాధ్యతలను భుజానకెత్తుకున్నట్లు కనిపిస్తోందన్నారు. అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి నేతలతో పోలిస్తే తోట త్రిమూర్తులకు

