
మూడు కార్పొరేషన్లకు ఒకేసారా? లేక తొలుత జీహెచ్‌ఎంసీకేనా ? సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ నగరం విస్తరించిన క్యూర్‌లోని మూడు కార్పొరేషన్లకు ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది. గత జీహెచ్‌ఎంసీ పాలకమండలి గడువు గత ఫిబ్రవరి 10న ముగిసిపోగా, 11 నుంచి స్పెషలాఫీసర్ పాలన కొనసాగుతుండటం తెలిసిందే. జీహెచ్‌ఎంసీ రూపాంతరం చెంది మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు కావడంతో మూడు కార్పొరేషన్ల ఎన్నికలపైనా పలువురు దృష్టి సారించారు. సాధారణంగా అయితే పాలకమండలి గడువు ముగిశాక ఆర్నెళ్ల లోపున కొత్త పాలకమండలి ఏర్పాటు కావాలి. అంటే ఆ లెక్కన ఆగస్టు రెండోవారంలోపున ఎన్నికలు జరగాలి. కానీ ప్రస్తుతమా పరిస్థితి కనిపించడం లేదు. ఓటరు జాబితాకు సంబంధించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ప్రక్రియ సోమవారం నుంచే ప్రారంభమైంది. ‘సర్’ ముగిశాక అక్టోబర్ ఒకటో తేదీన ఓటరు తుది జాబితా వెలువడనుంది. అంటే, అప్పటిలోగా ఎన్నికలకు అవకాశం లేదు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కార్యక్రమాలు అప్పటి నుంచి వడివడిగా చేపట్టినా, వార్డుల రిజర్వేషన్లు, మేయర్ రిజర్వేషన్లు తదితరమైనవి పూర్తిచేసి ఎన్నికలు నిర్వహించేందుకు డిసెంబర్ వరకు పట్టే అవకాశం ఉందని సంబంధిత నిపుణులు చెబుతున్నారు. మూడింటికా.. పాలకమండలి గడువును పరిగణనలోకి తీసుకొని కేవలం జీహెచ్‌ఎంసీకి మాత్రమే తొలుత ఎన్నికలు నిర్వహించి, దాని ఫలితాన్ని బట్టి సీఎంసీ, ఎంఎంసీలకు నిర్వహించనున్నారనే వాదనలున్నప్పటికీ, జీహెచ్‌ఎంసీ స్వరూపం మారిపోయింది. మిగతా రెండు కార్పొరేషన్లలోనూ పాత జీహెచ్‌ఎంసీ ప్రాంతాలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం మేరకే ఎన్నికలు ఒక్క కార్పొరేషన్‌కో.. రెండు లేక మూడు కార్పొరేషన్లకో జరగనున్నాయని చెబుతున్న వారూ ఉన్నారు. మూడు కార్పొరేషన్లకూ ఏకకాలంలో నిర్వహించే అవకాశాన్ని కాదనలేమని పలువురు భావిస్తున్నారు. ఇటీవలే సీఎంసీ, ఎంఎంసీల సొంత కార్యాలయ భవనాలతో పాటు ఒక్కో కార్పొరేషన్‌లో వందల కోట్ల పనులకు సీఎం శంకుస్థాపనలు చేశారు. ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు ఈ అంశాలు ఉపకరించనున్నాయి. ఇక జీహెచ్‌ఎంసీకి సంబంధించి నల్లగొండ ఫ్లై ఓవర్‌ను ఆలోగా ప్రారంభించడంతో