
జనసేన పార్టీ దేశ రాజధానిలో తన నూతన ప్రస్థానానికి శ్రీకారం చుట్టింది. సేన ప్రస్థానం పేరుతో మూడు రోజుల కార్యక్రమాన్ని చేపట్టింది. పార్టీ అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా ఈ సభకు హాజరయ్యారు. దీన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ప్రసంగించారు. జాతీయ సమగ్రతను చాటిచెప్పే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ సదస్సులో ఆయన దేశ సమైక్యత, అమరవీరుల అసమాన త్యాగాలను స్మరించుకున్నారు. ఈ చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఢిల్లీ గడ్డపై అధిక సంఖ్యలో జనసేన ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు పాల్గొనడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. దేశ స్వాతంత్య్రం కోసం సర్వస్వం త్యాగం చేసిన స్వాతంత్య్ర సమరయోధులకు, దేశభక్తులకు తన వినమ్ర నివాళులు అర్పించారు. ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యానికి బలమైన పునాది వేసి, భవిష్యత్ తరాలకు దిశానిర్దేశం చేసిన రాజ్యాంగ సృష్టికర్తలను ఆయన కొనియాడారు. దేశ రక్షణ రంగంలో సరిహద్దుల్లో శత్రువులతో పోరాడి వీరమరణం పొందిన అసంఖ్యాక సైనిక జవాన్ల సేవలను ఈ సభ వేదికగా గుర్తుచేసుకున్నారు. పూర్వీకుల సాహసాలు, నిరుపమాన త్యాగ నిరతి, దేశభక్తి కారణంగానే మనం స్వేచ్ఛ, సార్వభౌమత్వ, ప్రజాస్వామ్య దేశంలో జీవిస్తున్నామని భావోద్వేగంతో పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీని ఎందుకు వేదికగా ఎంచుకోవాల్సి వచ్చిందనే విషయంపై స్పష్టత ఇచ్చారు. ఢిల్లీ అంటే ఓ నగరం లేదా దేశ రాజధాని మాత్రమే కాదని, స్వాతంత్య్ర పోరాట కాలం నుంచి నేటి వరకు ఎందరో మహానుభావుల వీరోచిత త్యాగాలకు సాక్ష్యంగా నిలిచిన చారిత్రక పుణ్యభూమి అని వివరించారు. ఇక్కడి మట్టికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ చారిత్రక గడ్డపైనే భారత అత్యున్నత రాజ్యాంగం జన్మించిందని, దేశ విభజన నాటి తీవ్ర విషాద పరిస్థితులు, శరణార్థుల కన్నీళ్లను ఈ నేల స్వయంగా చూసిందని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు. అంతర్జాతీయ వేదికలపై దేశ గొప్పతనం బలంగా వినపించడానికి ఢిల్లీ ప్రధాన కేంద్రమని ఆయన పేర్కొన్నారు