
నీట్-యూజీ 2026 పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగా బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్‌లో ఆదివారం 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో ప్రముఖ నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాశ్ రాజ్ పాల్గొననున్నారు. యువత చేపట్టిన ఈ నిరసనకు ఆయన మద్దతు ప్రకటించారు.ఈ నిరసనలో పాల్గొనడంపై ప్రకాశ్ రాజ్ ఎక్స్ వేదికగా స్పందించారు. "ప్రభుత్వ వైఫల్యాలపై గళమెత్తేందుకు, ఈ శాంతియుత నిరసనకు మద్దతుగా బెంగళూరు వస్తున్నాను. దయచేసి అందరూ ఇందులో పాల్గొని ప్రభుత్వాన్ని జవాబుదారీ చేద్దాం" అని #JustAsking అనే హ్యాష్‌ట్యాగ్‌తో పిలుపునిచ్చారు. బీజేపీ ప్రభుత్వ విధానాలను తరచూ విమర్శించే ప్రకాశ్ రాజ్, ఈ నిరసనకు హాజరుకావడం ప్రాధాన్యత సంతరించుకుంది.నీట్ పేపర్ లీక్, సీబీఎస్‌ఈ సమస్యలు, పరీక్షల ఒత్తిడితో విద్యార్థుల ఆత్మహత్యలు వంటి అంశాలపై 'కాక్రోచ్ జనతా పార్టీ' అనే యువత నేతృత్వంలోని ఉద్యమం దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తోంది. ఇప్పటికే ఢిల్లీలోని జంతర్ మంతర్, పుణె, లక్నో, హైదరాబాద్‌లలో నిరసనలు చేపట్టారు. హైదరాబాద్‌లో జరిగిన నిరసనకు సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ మద్దతు తెలిపారు. రాజ్యాంగం, జాతీయ జెండాలను చేతబూని శాంతియుతంగా నిరసన తెలుపుతూ, విద్యావ్యవస్థలోని లోపాలపై ప్రభుత్వాన్ని నిలదీయడమే తమ లక్ష్యమని నిర్వాహకులు చెబుతున్నారు