
పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల మధ్య భారత నావికుల భద్రతపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మద్దతు తెలపడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. దీంతో కాంగ్రెస్, బీజేపీ మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది.ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో మోదీ భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో భారత నావికుల భద్రత అంశాన్ని ప్రధాని ప్రస్తావించారని థరూర్ చెప్పారు. యుద్ధ సమయంలో వాణిజ్య నౌకల్లో పనిచేసే సాధారణ నావికులు టార్గెట్ కాకూడదని మోదీ స్పష్టంగా చెప్పారని పేర్కొన్నారు.ఇటీవల ఒమన్ గల్ఫ్ ప్రాంతంలో అమెరికా దాడుల్లో ముగ్గురు భారత నావికులు మరణించారు. ఈ అంశాన్ని ట్రంప్‌తో సమావేశంలో ప్రధాని బహిరంగంగా ప్రస్తావించలేదంటూ కాంగ్రెస్ విమర్శలు చేసింది. అమెరికా నుంచి క్షమాపణ గానీ, విచారం గానీ ఎందుకు కోరలేదని ప్రశ్నించింది.థరూర్ వ్యాఖ్యలను బీజేపీ వెంటనే రాజకీయ అస్త్రంగా మార్చుకుంది. కాంగ్రెస్ నేతలే మోదీ దౌత్యాన్ని ప్రశంసిస్తున్నారని, దీంతో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శలు బలహీనపడ్డాయని బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో థరూర్ వ్యాఖ్యలు కాంగ్రెస్‌లోనూ చర్చకు దారితీశాయి.జీ7 సమావేశం సందర్భంగా హర్మూజ్ జలసంధి సహా గల్ఫ్ ప్రాంతంలో పనిచేస్తున్న భారత నావికుల భద్రత అత్యంత ముఖ్యమని ట్రంప్‌కు మోదీ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భారతీయులు సముద్ర రవాణా రంగంలో పనిచేస్తున్నారని, వారి రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు