
ప్రపంచ సాంకేతిక రంగంలో ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) హవా నడుస్తోంది. అయితే, ఈ రంగం కేవలం కొన్ని పాశ్చాత్య టెక్ దిగ్గజాల గుత్తాధిపత్యంలోనే ఉండిపోతుందా? లేక భారత్ వంటి దేశాలు స్వయంసమృద్ధి సాధించగలవా? అనే చర్చకు జోహో అధినేత శ్రీధర్ వెంబు సరికొత్త దిశను చూపించారు. సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులపై నిరంతరం చర్చించే వెంబు.. అంతర్జాతీయ మార్కెట్లో చైనా ఏఐ కంపెనీల పోటీని ప్రశంసించడంతో పాటు భారత్‌లో సొంత ఏఐ మోడళ్లు పుట్టుకొస్తాయని చెప్పారు. టెక్ మార్కెట్లో అమెరికన్ కంపెనీల గుత్తాధిపత్య ధోరణిని ఎండగట్టడానికి శ్రీధర్ వెంబు ఇటీవల ఒక ఆసక్తికరమైన ఉదాహరణను పంచుకున్నారు. ఒక భారతీయ కస్టమర్ తన మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లైసెన్స్ పునరుద్ధరణ సమయంలో ఎదురైన అనుభవాన్ని ఆయన ఉదహరించారు. ‘సదరు కస్టమర్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ నుంచి స్వదేశీ సాఫ్ట్‌వేర్ అయిన జోహో ఆఫీస్ సూట్‌కు మారిపోవాలని అనుకుంటున్నట్లు చెప్పగానే.. మైక్రోసాఫ్ట్ ఒక్కసారిగా దిగొచ్చింది. తన కస్టమర్‌ను కోల్పోకూడదనే భయంతో ఏకంగా 90% తగ్గింపును ఆఫర్ చేసింది’ అన్నారు. పోటీ లేకపోతే ఈ దిగ్గజాలు కస్టమర్లను ఎలా దోపిడీ చేస్తాయో చెప్పడానికి ఈ సంఘటనే నిదర్శనమని వెంబు పేర్కొన్నారు. మార్కెట్‌లో ప్రత్యామ్నాయాలు ఉన్నప్పుడే వినియోగదారుడికి నిజమైన లబ్ధి చేకూరుతుందని ఆయన స్పష్టం చేశారు. ‘యాంటీట్రస్ట్’ కేసు గుర్తుచేసిన జోహో బాస్ మైక్రోసాఫ్ట్ అనుసరిస్తున్న వ్యాపార పద్ధతులను విమర్శిస్తూ.. గతంలో ఆ సంస్థ ఎదుర్కొన్న చట్టపరమైన సవాళ్లను వెంబు గుర్తుచేశారు. యునైటెడ్ స్టేట్స్ వర్సెస్ మైక్రోసాఫ్ట్ కార్ప్ (1998): మైక్రోసాఫ్ట్ చట్టవిరుద్ధంగా తన గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తోందని యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్‌తో పాటు 20 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ కోర్టుకెక్కారు. పోటీని అణచివేసే కుట్ర: విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పాటు ‘ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్’ బ్రౌజర్‌ను ఉచితంగా ఇన్-బిల్ట్‌గా ఇవ్వడం ద్వారా.. అప్పట్లో పాపులర్ అయిన ‘నెట్‌స్కేప్ నావిగేటర్’ వంటి ప్రత్యర్థి బ్రౌజర్ల మనుగడను మైక్రోసాఫ్ట్ దెబ్బతీసిందని ఆరోపణలు వచ్చాయి. కంపెనీ