
తండ్రి ఎమ్మెల్యే. అయినా తనని తాను నిరూపించుకోవాలనుకున్నారామె. కష్టపడి చదివి... తాజాగా అఖిల భారత స్థాయిలో తొలి ర్యాంకు సాధించారు దేవినా గెహ్లాత్. తాజాగా కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ- యూజీ) ఫలితాలు వెలువడ్డాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహించే ఈ ప్రవేశపరీక్ష ద్వారా కేంద్ర, రాష్ట్ర, డీమ్డ్ యూనివర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లోని ప్రవేశాలు కల్పిస్తారు. ఈసారి 15 లక్షలమంది పోటీపడ్డారని అంచనా. దానిలో తొలిస్థానంలో నిలిచారు దేవినా. నాన్న కైలాశ్ గెహ్లాత్ ఎమ్మెల్యే. ఈమెది దిల్లీ. డీపీఎస్ వసంత్ కుంజ్‌లో పన్నెండో తరగతి పూర్తిచేశారీమె. ‘ఫస్ట్ నేనేనా అని ఎన్నిసార్లు చెక్ చేసుకున్నానో! పరీక్ష చాలా బాగా రాశానని అనుకున్నా. కానీ దేశంలోనే తొలి స్థానాన్ని సాధిస్తానని మాత్రం ఊహించలేదు’ అంటారు దేవినా. క్రమశిక్షణ, స్థిరమైన సన్నద్ధత తన విజయానికి కారణమంటారామె. ‘ఒక్కదానిమీదే దృష్టిపెట్టలేదు. ప్రతి సబ్జెక్టునీ రోజూ చదివా. రివిజన్ తప్పకుండా చేసేదాన్ని. గత సంవత్సరాల మాదిరి ప్రశ్నపత్రాలనీ సాధన చేశా. ఇవన్నీ నాకు సాయపడ్డాయి. అయితే తొలిరోజుల్లో నేనూ ఒత్తిడికి గురయ్యా. బోర్డు ఎగ్జామ్స్ అవ్వగానే సాధన మొదలుపెట్టా. ఏం చదవాలో ఎలా చదవాలో తెలీదు. భవిష్యత్తుకు సంబంధించిన విషయం. ఇంత ఒత్తిడిలో నేను చేయగలనా అనీ అనుకున్నా. కానీ మా అమ్మానాన్నలు, టీచర్ల అండతో నెమ్మదిగా దాన్నుంచి బయటపడ్డా’నంటారామె. తనకి సాహిత్యం, చదవడం, రాయడమంటే ఇష్టమట. ఇంగ్లిష్‌లో ఆనర్స్ చేసి, జర్నలిజంవైపు వెళ్తారట. ‘చిన్నప్పట్నుంచీ నాన్న ఎమ్మెల్యేగా, మినిస్టర్‌గా ప్రజలకు సేవ చేయడం చూశా. ఎంతోమంది ఆయన సాయం పొందారు. అది నాకూ రాజకీయాలపై ఆసక్తి ఏర్పడేలా చేసింది. కానీ భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేను. ప్రస్తుతం నా విజయానికి మాత్రం అందరూ ఆనందంగా ఉన్నా’రంటూ చెప్పుకొచ్చారు దేవినా. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి