
EPF Interest | దిల్లీ: ఈపీఎఫ్ చందాదారులకు గుడ్‌న్యూస్. లక్షలాది మంది ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈఫీఎఫ్ వార్షిక వడ్డీ ఈ నెలలోనే జమ కానుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ ప్రతిపాదించిన 8.25 శాతం వడ్డీకి కేంద్ర ఆర్థికశాఖ తాజాగా ఆమోదం తెలిపింది. 2025-26 సంవత్సరానికి గాను ఖాతాదారులకు 8.25 శాతం వార్షిక వడ్డీ అందించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) మార్చి 2న చేసిన సిఫార్సులను యథాతథంగా ఆమోదించింది. వరుసగా మూడో ఏడాదీ ఇదే వడ్డీ రేటు కొనసాగుతోంది. సాధారణంగా సీబీటీ సిఫార్సు చేసిన వడ్డీని ఆర్థిక మంత్రిత్వశాఖ నోటిఫై చేయాల్సివస్తుంది. గతేడాది మే 24న వడ్డీని కేంద్రం నోటిఫై చేయగా.. ఈ ఏడాది దాదాపు నెల రోజులు ఆలస్యంగా ఆమోదం తెలపడం గమనార్హం. అయితే, ఈ నెలాఖరులోగా పీఎఫ్ ఖాతాలకు వడ్డీ జమయ్యే అవకాశం ఉందని సంబంధితవర్గాలు తెలిపాయి. గతంలో కేంద్రం ఆమోదం తెలిపిన తర్వాత కూడా వడ్డీ జమ అవడానికి మరికొన్ని రోజులు సమయం పట్టేది. కొత్త ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేసిన నేపథ్యంలో చందాదారుల ఖాతాల్లో వెంటనే నిధులు జమయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. గత ఆర్థిక సంవత్సరానికి కేంద్రం ఇప్పుడు వడ్డీ జమ చేస్తోంది. కానీ ఆర్థిక సంవత్సరం ముగిసి మూడు నెలలు కావొస్తోంది. ఈ ఆలస్యం వల్ల ఆ మేర చక్రవడ్డీ ప్రయోజనం కోల్పోతామన్న ఆందోళన కొందరు చందాదారుల్లో నెలకొంది. కానీ, అలాంటి భయాలేవీ అక్కర్లేదంటోంది భవిష్య నిధి సంస్థ. ఈపీఎఫ్ నిల్వలపై ఆర్థిక సంవత్సరం మొదటి తేదీ నుంచి ఆ ఏడాది చివరి తేదీ వరకు ఏ నెలకు ఆ నెల వడ్డీని గణిస్తారు. నెలనెలా లెక్కించినప్పటికీ వడ్డీ మాత్రం ఏడాది చివర్లోనే జమ చేస్తారు. ఒకవేళ విత్‌డ్రాలు ఉంటే ఆ మేర వడ్డీ తగ్గుతుంది. అలాగే, నిలిచిపోయిన ఖాతాలకు ఈపీఎఫ్‌ఓ ఎలాంటి వడ్డీ చెల్లించదు