
టెహ్రాన్ ‘విజయం’ అంటోంది.. కానీ ఇరాన్ ప్రజలు ‘ఉపశమనం’ అంటున్నారు. అమెరికాతో ఒప్పందాన్ని ప్రభుత్వం రాజకీయ గెలుపుగా చూపిస్తుండగా, సంక్షోభంలో కూరుకుపోయిన ప్రజలు మాత్రం తమ జీవితం మెరుగుపడుతుందా?.. ధరలు తగ్గుతాయా? ఉద్యోగాలు వస్తాయా? పిల్లల భవిష్యత్తు బాగుంటుందా? అనే దానిపైనే దృష్టి పెట్టారు. ఆర్థిక కష్టాలు, యుద్ధ భయాలే ఈ ఒప్పందానికి అసలు కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాధారణ ప్రజలు మాత్రం దాన్ని తమ జీవితాల్లో కొంత వెలుగు నింపే అవకాశంగా చూస్తున్నారు. గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ ఆంక్షలు ఇరాన్ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీశాయి. దేశ ప్రధాన ఆదాయ వనరైన చమురు ఎగుమతులపై పరిమితులు విధించడంతో విదేశీ మారక నిల్వలు తగ్గిపోయాయి. ఫలితంగా ఇరానియన్ రియాల్ విలువ క్షీణించింది. ద్రవ్యోల్బణం భారీగా పెరిగి నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకాయి. ఒకప్పుడు మధ్యతరగతికి అందుబాటులో ఉన్న అనేక వస్తువులు ఇప్పుడు విలాసంగా మారిపోయాయి. టెహ్రాన్‌కు చెందిన 45 ఏళ్ల ఉపాధ్యాయుడు అలీ రెజా మాటల్లో చెప్పాలంటే.. మాకు రాజకీయ విజయాలు అవసరం లేదు. మార్కెట్‌కు వెళ్లినప్పుడు సరుకులు కొనగలిగితే అదే విజయం.. ఈ భావన ప్రస్తుతం దేశవ్యాప్తంగా కనిపిస్తోంది. ప్రజల దృష్టిలో అమెరికాతో ఒప్పందం అంటే అంతర్జాతీయ రాజకీయాల్లో గెలుపు కాదు.. కుటుంబ ఖర్చులు తగ్గే అవకాశం అని భావిస్తున్నారు. ఆంక్షల అసలు ప్రభావం ప్రజలపైనే.. అమెరికా ఆంక్షల కారణంగా ఇరాన్‌లో కేవలం చమురు ఆదాయం మాత్రమే తగ్గలేదు. విదేశీ బ్యాంకింగ్ వ్యవస్థలతో సంబంధాలు దెబ్బతినడంతో మందులు, వైద్య పరికరాలు, పరిశ్రమలకు అవసరమైన ముడిసరుకుల దిగుమతులు కూడా కష్టతరమయ్యాయి. క్యాన్సర్, అరుదైన వ్యాధుల చికిత్సకు అవసరమైన మందులు దొరకక చాలా కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఇరాన్ యువత పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంది. నిరుద్యోగం, తక్కువ వేతనాలు, విదేశాల్లో అవకాశాల కొరత కారణంగా వేలాది మంది యువకులు నిరాశలో ఉన్నారు. చాలా మంది ఉన్నత విద్య పూర్తిచేసినా సరైన ఉద్యోగాలు దొరకడం