
భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలు ప్రకృతి సంపదకు, పర్యావరణ హితమైన జీవనశైలికి పుట్టినిల్లు. ఈ క్రమంలోనే పర్యావరణ పరిరక్షణ కోసం అక్కడి ప్రజలు సాగిస్తున్న విశేష కృషిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా పరిచయం చేశారు. జూన్ 28న ప్రసారమైన తన మన్ కీ బాత్ 135వ కార్యక్రమంలో అస్సాంలోని అరుదైన హర్గిలా పక్షి సంరక్షణ ఉదాహరణను, అలాగే మేఘాలయలోని జీవన వేర్ల వంతెనల (లివింగ్ రూట్ బ్రిడ్జెస్) విశిష్టతను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. సమాజంలో ఉన్న అపోహలను తొలగిస్తూ, ప్రకృతితో మమేకమై జీవించడం ఎలాగో ఈ రెండు అంశాలు నిరూపిస్తున్నాయని ప్రధాని మోదీ ప్రశంసించారు.హర్ అంటే ఎముకలు, గిలా అంటే మింగడం అని అర్థం. ఈ పక్షులు ఎముకలను కూడా సునాయాసంగా మింగేయగలవు. అయితే, సుమారు 1.5 మీటర్ల ఎత్తు, వింతైన రూపం కారణంగా వీటిని చూసి ప్రజలు భయపడేవారు. అస్సాంలో కనిపించే అరుదైన హర్గిలా పక్షి సుదీర్ఘకాలంగా స్థానిక ప్రజల మూఢనమ్మకాలకు, భయాందోళనలకు బలవుతూ వచ్చింది. నిజానికి పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచడంలో, చనిపోయిన జంతువుల అవశేషాలను తొలగించడంలో ఈ పక్షులు అత్యంత కీలకపాత్ర పోషిస్తాయి. అయినప్పటికీ, వీటి మనుగడను గుర్తించని స్థానికులు హర్గిలా పక్షుల గూళ్లు ఉన్న చెట్లను కూడా క్రూరంగా నరికివేసేవారు. కేవలం అజ్ఞానం వల్లే ఒక ఉపయోగకరమైన పక్షి జాతి వినాశనం అంచుకు చేరుకుందని ప్రధాని వివరించారు.అపోహలను పటాపంచలు చేసిన హర్గిలా సైన్యంఈ గడ్డు పరిస్థితుల్లో ఆ పక్షుల రక్షణ కోసం జీవశాస్త్రవేత్త పూర్ణిమ దేవి బర్మన్ నడుం బిగించారు. సమాజంలో బలంగా నాటుకుపోయిన ఈ మూఢనమ్మకాలను తొలగించాలని ఆమె గట్టిగా సంకల్పించారు. ఇందులో భాగంగా స్థానిక మహిళలను ఏకం చేసి, శాస్త్రీయ దృక్పథంతో వారికి అవగాహన కల్పించారు. పూర్ణిమ దేవి బర్మన్ చూపిన బాటలో నడిచిన మహిళలు క్రమంగా ఒక పెద్ద ఉద్యమంగా రూపాంతరం చెందారు. అలా ఏర్పడిందే ఈనాటి పర్యావరణ రక్షక దళం హర్గిలా ఆర్మీ.