
హైదరాబాద్‌లోని కొత్తపేటలో ఎస్‌బీఐ కాలనీకి వెళ్లి ‘అందరి ఇల్లు’ ఎక్కడా అని అడిగితే రోడ్ నంబర్ 2లో ‘మీ సేవ’ ఎదురుగా ఉంటుందని ఎవరైనా చెబుతారు. అటువైపు వెళితే గ్రౌండ్ ఫ్లోర్‌లో ఓ నాలుగు గదుల ఇంటికి ‘అందరి ఇల్లు’ అని బోర్డు ఉంటుంది. తలుపులు తెరిచే ఉంటాయి. లోపలికి వెళితే ఆకలిగొన్నవారు వండుకుంటూ కనబడతారు. వండింది ఉంటే తినేవారు కనిపిస్తారు. పక్కనే బియ్యం, నూనె, పప్పు, ఉప్పు, అన్ని దినుసులు ఉంటాయి. కిచెన్‌లో స్టవ్, వంట పాత్రలు, ప్లేట్లు ఉంటాయి. ఈ ఇంటిలోకి వచ్చినవారు వండుకొని తినడానికి అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఏవి తక్కువ పడినా వెంటనే సమకూరు తాయి. అంతా ఉచితమే. మీ ఇల్లే అనుకోవచ్చు. దీనిని పిల్లల డాక్టరు వింజమూరి సూర్యప్రకాష్, గైనకాలజిస్టు సామవేదం కామేశ్వరి దంపతులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 15వ తేదీతో అందరి ఇల్లు 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. నిరాటంకంగా సాగుతున్న ఈ అన్న వసతికి వారు ఒకరి దగ్గర చేయి చాపలేదు, తామేదో ఘనకార్యం చేస్తున్నట్లు ప్రచారాన్ని కోరుకోలేదు. ఈ భోజన వసతి గురించి తెలిసిన గ్రామీణ పేద యువత అందరి ఇల్లుకు రావడం మొదలైంది. వారిలో ఎక్కువ మంది పోటీ పరీక్షల తయారీకి ఇల్లు వదిలి వచ్చినవారని తెలుసుకొని వారికోసం మరిన్ని వసతులు కల్పించారు. 2011లో వారు చదువుకోవడానికి లైబ్రరీ, కుర్చీ బల్లలు సమకూర్చారు. రాత్రుళ్లు ఇక్కడే ఉండిపోవడానికి కొన్ని బెడ్స్ కూడా వేశారు. ఇందులో ఆరు నెలలు, ఏడాది పాటు ఉండి ఉద్యోగ ప్రయత్నం కొనసాగించినవారు ఎందరో! పై అంతస్తులో కామేశ్వరి క్లినిక్ ఉంటుంది. వైద్యం కోసం వచ్చిన పేదలకు ఆహారానికి, నివాసానికి బెంగ అక్కర లేదు. పేద మహిళలు ప్రసూతి అయ్యే దాకా ఇక్కడే గడిపిన సందర్భాలు ఉన్నాయి. సూర్యప్రకాష్ రోజు ఉదయమే స్వయంగా వచ్చి సరుకులు, సదుపాయాలు సరిపడా ఉన్నాయా అని చూసుకుంటారు. ఈ ఆలోచన (Andari Illu)