
'పేరు గొప్ప - ఊరు దిబ్బ' అనిపించేలా బిగ్ మూవీస్ విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయట... ఆ ముచ్చటేదో ముందుగా చూద్దాం... హిట్టు కొట్టాలంటే గ్రాఫిక్స్ తో ఓ పట్టు పట్టాలి అంటూ సినీజనం పరుగులు తీస్తున్నారు. వీఎఫ్ఎక్స్ కోసం వందల కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నారు. ఎన్ని కోట్లు ఖర్చు చేసినా పేరు గొప్ప- ఊరు దిబ్బ అన్నట్టు కొన్ని సినిమాలు వస్తున్నాయి. అదే సమయంలో ఉన్నంతలోనే ఆకట్టుకుంటూ మరికొన్ని మురిపిస్తున్నాయి. ఆ వైనమేంటో చూద్దాం... అంత చేసి లాభమేంటి? ప్రస్తుతం మన దేశంలో ఎక్కడ చూసినా సినీ ఫ్యాన్స్ రెండు సినిమాల గురించి భలేగా ముచ్చటించుకుంటున్నారు. వాటిలో ఒకటి రాజమౌళి డైరెక్షన్ లో మహేశ్ హీరోగా తెరకెక్కుతోన్న 'వారణాసి'. రెండోది ఈ యేడాదే దీపావళికి వెలుగు చూడనున్న పౌరాణిక చిత్రం 'రామాయణ- 1'. ఈ రెండు సినిమాల్లోనూ గ్రాఫిక్స్ కు అత్యంత ప్రాధాన్యత ఉంది... స్టార్ కాస్ట్ రెమ్యూనరేషన్స్, జనరల్ షూటింగ్ ఖర్చు కంటే 'వీఎఫ్ఎక్స్' కోసం వెచ్చిస్తున్న మొత్తాలే ఈ రెండు సినిమాల మూవీ బడ్జెట్ ను అమాంతం పెంచేశాయని టాక్... అయితే ఈ రెండు చిత్రాల ట్రైలర్, గ్లింప్స్ జనం ముందుకు రాగానే నిరుత్సాహం కలిగించాయి. 'వారణాసి'లో హీరో మహేశ్ ఎద్దుపై వచ్చే సీన్ రాజమౌళి స్టాండర్డ్ కి తగ్గట్లు లేదని సినీ ఫ్యాన్స్ అంటున్నారు. అక్కడా అనుమానమే...!? ఇక 'రామాయణ' సినిమా విషయానికి వస్తే ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్న నమిత్ మల్హోత్రాకే ప్రసిద్ధి చెందిన విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీ ఉంది... నమిత్ కు చెందిన 'ప్రైమ్ ఫోకస్ లిమిటెడ్' కంపెనీ రూపొందించిన విజువల్ ఎఫెక్ట్స్ కు ఆస్కార్ అవార్డ్స్ కూడా లభించాయి. ఈ సంస్థ వీఎఫ్ఎక్స్ తో తెరకెక్కిన 'ఇన్ సెప్షన్', 'ఇంటర్ స్టెల్లార్', 'ఎక్స్ మెషీనా', 'బ్లేడ్ రన్నర్ 2049', 'ఫస్ట్ మేన్', 'టెనెట్', 'డ్యూన్', 'డ్యూన్-2' చిత్రాలు బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలోనే అకాడమీ అవార్డులు సంపాదించాయి