
చెన్నై: తమిళనాడులో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తమిళనాడులో ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ముఖ్యమంత్రి విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్త బస్సులను ప్రారంభించడంతో పాటుగా ఆయన కూడా బస్సులో ప్రయాణించి అందరి దృష్టిని ఆకర్షించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే సమయంలో గత ముఖ్యమంత్రి స్టాలిన్ బస్సులో ప్రయాణించిన వీడియోలను విజయ్ అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీంతో, విజయ్, స్టాలిన్ వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్.. రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణికుల సౌకర్యార్థం రూ.127 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసిన 300 కొత్త ప్రభుత్వ బస్సులను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం విజయ్ స్వయంగా కొత్త బస్సులో ప్రయాణించారు. చెన్నైలో ప్రారంభ కార్యక్రమం అనంతరం మెరీనా బీచ్ వరకు బస్సులో ప్రయాణించిన ఆయన, సాధారణ ప్రయాణికుడిలా కండక్టర్ వద్ద టికెట్ కొనుగోలు చేశారు. టికెట్‌కు సరిపడా చిల్లర డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకోవడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. సాధారణంగా టికెట్ ఇస్తున్న సమయంలో "చిల్లర ఇవ్వండి" అనేది కండక్టర్ల నుంచి తరచూ వినిపించే ఫిర్యాదు. అయితే సీఎం విజయ్ మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితమైన చిల్లరతో టికెట్ కొనుగోలు చేయడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రారంభించిన 300 బస్సుల్లో డీజిల్, సీఎన్‌జీ వాహనాలు ఉన్నాయి. ఈ బస్సులు చెన్నైతో పాటు రాష్ట్రంలోని ఆరు రవాణా జోన్లలో ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ప్రజా రవాణా సేవల నాణ్యతను మెరుగుపరచడం, ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని కల్పించడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ చర్య చేపట్టింది. తమిళనాడు ప్రజా రవాణా వ్యవస్థ దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రవాణా నెట్‌వర్క్‌లలో ఒకటిగా గుర్తింపు పొందింది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని రవాణా సంస్థలు ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి. నాగదుర్గ