
సాధారణంగా హాలీవుడ్‌లో హిట్ సినిమాలు వందల మిలియన్ల డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కుతాయి. కానీ ‘అబ్సెషన్’ మాత్రం ఆ ట్రెండ్‌కు పూర్తి భిన్నం. సుమారు లక్ష డాలర్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం విడుదలైన కొద్ది వారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా 234 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించింది. భారత కరెన్సీలో ఇది రూ.2,000 కోట్లకు పైగానే ఉంటుంది. ఇంత తక్కువ పెట్టుబడితో రూపొందిన సినిమా ఇంతటి స్థాయిలో లాభాలు ఆర్జించడం హాలీవుడ్ చరిత్రలోనే అరుదైన విషయంగా ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఫోకస్ ఫీచర్స్ విడుదల చేసిన చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఇది ఒకటిగా నిలిచింది. ఈ చిత్ర కథ మొత్తం ఒక సాధారణ ప్రేమకథతో మొదలవుతుంది. మ్యూజిక్ షాప్‌లో పనిచేసే యువకుడు బేర్ తన స్నేహితురాలు నిక్కీని ప్రేమిస్తుంటాడు. అయితే తన ప్రేమను వ్యక్తపరచడానికి ధైర్యం చేయలేడు. ఈ సమయంలో అతడి చేతికి ఒక విచిత్రమైన అతీంద్రియ వస్తువు దొరుకుతుంది. దాని ద్వారా తాను ప్రేమించే అమ్మాయి తనను ప్రేమించాలని కోరుకుంటాడు. ఆశ్చర్యకరంగా ఆ కోరిక నిజమవుతుంది. కానీ ఆ ప్రేమ సాధారణ ప్రేమగా కాకుండా, మితిమీరిన ఆకర్షణగా, నియంత్రణ కోరికగా, చివరకు ప్రమాదకరమైన మోజుగా మారుతుంది. అక్కడి నుంచే కథ భయానక మలుపులు తిరుగుతుంది. ప్రేమ, ఆకర్షణ, మానసిక అస్థిరత, అతీంద్రియ శక్తులు కలిసిన కథనంతో దర్శకుడు ప్రేక్షకులను చివరి వరకు ఉత్కంఠలో ఉంచాడు. ‘అబ్సెషన్’ను సాధారణ హారర్ సినిమాగా చూడలేం. ఇందులో జంప్ స్కేర్స్, రక్తపాత సన్నివేశాలు ఎక్కువగా ఉండవు. అయినప్పటికీ సినిమా మొత్తం ఒక అసహజమైన భయం ప్రేక్షకుడిని వెంటాడుతూనే ఉంటుంది. ప్రారంభంలో కథ చాలా నెమ్మదిగా సాగుతుంది. పాత్రల పరిచయం, వారి సంబంధాలపై దర్శకుడు ఎక్కువ సమయం కేటాయించాడు. అయితే ఒకసారి అతీంద్రియ కోరిక నెరవేరిన తర్వాత కథ వేగం పూర్తిగా మారిపోతుంది. ప్రత్యేకంగా సెకాండాఫ్ లో వచ్చే సంఘటనలు ప్రేక్షకులను సీట్లోంచి