
ప్రధానమంత్రి, ముఖ్యమంత్రుల పదవులకు సంబంధించి కీలక రాజ్యాంగ సవరణకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. 130వ రాజ్యాంగ సవరణ బిల్లును రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. అవినీతి వంటి తీవ్రమైన కేసుల్లో ప్రధాని లేదా సీఎం అరెస్టై 30 రోజులకు పైగా జైలులో ఉంటే వారి పదవిని రద్దు చేయాలన్నదే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. గతేడాది ప్రవేశపెట్టిన ఈ బిల్లును ప్రతిపక్షాల డిమాండ్ మేరకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపారు. జేపీసీ నివేదిక సమర్పించిన తర్వాత ప్రభుత్వం దీనిపై ముందుకు వెళ్లే అవకాశముందని సమాచారం.ఈ బిల్లు రాజ్యాంగ సవరణకు సంబంధించినది కావడంతో ప్రత్యేక మెజారిటీ అవసరం. లోక్‌సభ, రాజ్యసభల్లో హాజరైన సభ్యుల్లో మూడింట రెండొంతుల మంది మద్దతు తెలపాలి. అలాగే రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 నిబంధనలను కూడా పాటించాల్సి ఉంటుంది. గతంలో ఈ బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దేశ అత్యున్నత ప్రజాప్రతినిధుల పదవులకు సంబంధించిన అంశం కావడంతో మరింత పరిశీలన అవసరమని అప్పట్లో వాదించాయి.గతేడాదితో పోలిస్తే పార్లమెంట్‌లో ఎన్డీయే బలం పెరిగింది. అయినప్పటికీ రాజ్యాంగ సవరణకు అవసరమైన మూడొంతుల మెజారిటీ మాత్రం ఇంకా లేదు. అందుకే బీజేడీ, వైఎస్సార్‌సీపీ వంటి ప్రాంతీయ పార్టీల మద్దతు కీలకంగా మారే అవకాశం ఉంది. ఈ బిల్లుకు అవి మద్దతు ఇస్తాయా లేదా అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వాటి నిర్ణయంపైనే బిల్లు భవితవ్యం ఆధారపడే అవకాశముంది