
భువనగిరి కోట అభివృద్ధి పనులను అక్టోబర్ 2లోగా పూర్తిచేయాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. సోమవారం కోట వద్ద పర్యటించిన ఆయన కొనసాగుతున్న పనుల పురోగతిని సమీక్షించారు.రోప్‌వే, హోటల్, పార్కింగ్, మరుగుదొడ్లు, చిన్నారుల ఆట స్థలం, కోట పునరుద్ధరణ పనులు, కేఫ్, ఇంటర్‌ప్రిటేషన్ సెంటర్ సహా పర్యాటక సదుపాయాలను పరిశీలించారు. అవసరమైతే రాత్రింబవళ్లు పనులు చేపట్టి గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని జూపల్లి తెలిపారు. చారిత్రక వైభవాన్ని కాపాడుతూ భువనగిరి కోటను ఆధునిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. యాదాద్రి, భువనగిరి కోట, కొలనుపాకలను అనుసంధానిస్తూ సమగ్ర ఆధ్యాత్మిక-వారసత్వ పర్యాటక సర్క్యూట్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు.కేంద్ర ప్రభుత్వం స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద రూ.56.81 కోట్లతో ‘భువనగిరి ఫోర్ట్ ఎక్స్‌పీరియెన్షియల్ జోన్’ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. ఇందులో రూ.17.91 కోట్లతో 1,020 మీటర్ల పొడవైన రోప్‌వే నిర్మిస్తున్నారు. గంటకు 250 నుంచి 300 మంది ప్రయాణికులు వినియోగించుకునే సామర్థ్యంతో ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. మిగిలిన నిధులతో రహదారులు, పార్కింగ్, వీక్షణ గ్యాలరీ, కేఫ్, విద్యుదీకరణ, తాగునీటి సదుపాయాలు, సీసీ కెమెరాలు, భద్రతా వ్యవస్థలు, వారసత్వ కట్టడాల పునరుద్ధరణ వంటి పనులు చేపడుతున్నారు