
ఖమ్మం జిల్లా చింతకాని మండలం మత్కేపల్లి క్రాస్ రోడ్డులో ఈనెల 30న జరిగే సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభా స్థలాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకు రైతుభరోసా కింద రూ.9 వేల కోట్లను ముఖ్యమంత్రి విడుదల చేయనున్నారన్నారు. ఖమ్మం, జూన్ 25: జిల్లాలోని చింతకాని మండలం మత్కేపల్లి క్రాస్ రోడ్డులో ఈనెల 30న జరిగే సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభా స్థలాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు(గురువారం) పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాప్రభుత్వంలో అత్యంత ప్రాధాన్యం కలిగిన కార్యక్రమం రైతు భరోసా అని చెప్పుకొచ్చారు. జులై నెలలోనే రైతులకు రైతుభరోసా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకు రైతుభరోసా కింద రూ.9 వేల కోట్లను ముఖ్యమంత్రి విడుదల చేయనున్నారన్నారు. ఈ సభకు రైతు ఆశీర్వాద సభగా రైతులే నామకరణం చేశారని తెలిపారు. భారత దేశంలో అత్యధికంగా పంటలు పండించిన రాష్ట్రం తెలంగాణ అని మంత్రి అన్నారు. వ్యవసాయ రంగంలో పంటమార్పిడి విధానంలో ఆయిల్ ఫాం సాగును ప్రోత్సహిస్తున్నామన్నారు. భవిష్యత్తులో పది వేల ఎకరాలను రైతులు సాగు చేసే విధంగా సహకారం అందజేస్తున్నామని చెప్పారు. దేశంలో తెలంగాణలోనే అత్యధిక ఆయిల్ ఫాం సాగు జరుగుతోందన్నారు. పామాయిల్ ఫ్యాక్టరీల నిర్మాణం శరవేగంగా జరుగుతోందని తెలిపారు. రెండేళ్లలో లక్ష కోట్లు రైతాంగానికి అందజేశామని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి పంటను కొనుగోలు చేశామని అన్నారు. ఏడాదికి పది వేల కోట్లు నష్టం వచ్చినప్పటికీ కొనుగోలు చేస్తున్నామన్నారు. ఏడు రకాల వరి అందుబాటులో ఉందని రైతాంగానికి తుమ్మల తెలియజేశారు. వాతావరణ పరిస్థితులను బట్టి రైతులు పంటల సాగుపై దృష్టి సారించాలన్నారు. బ్లాక్ మార్కెట్‌లో యూరియా ఉంచుతున్నారని... నిల్వ చేసి అధిక ధరలకు అమ్మేందుకు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ఎవరూ కూడా భయపడవద్దని.. అందరికీ యూరియా అందిస్తామని స్పష్టం చేశారు