
ఆహార కల్తీపై హెచ్-ఫాస్ట్ ఉక్కుపాదం మోపింది. హైదరాబాద్‌లోని హోటళ్లు, రెస్టారెంట్లలో దాడులు చేసిన హెచ్-ఫాస్ట్ అధికారులు భారీగా కేసులు నమోదు చేశారు. హైదరాబాద్, జులై 4: ఆహార కల్తీపై హెచ్-ఫాస్ట్ ఉక్కుపాదం మోపింది. నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లలో దాడులు చేసిన హెచ్-ఫాస్ట్ అధికారులు భారీగా కేసులు నమోదు చేశారు. 100 రోజుల్లో దాదాపు 185 కేసులను నమోదు చేశారు. దాడుల్లో 121.87 టన్నుల కల్తీ, నాణ్యతలేని ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మార్చి 19న ప్రారంభమైన హెచ్-ఫాస్ట్ దాడులకు 100 రోజులు పూర్తి అయ్యింది. ఈ వంద రోజుల్లో రాజేంద్రనగర్ జోన్‌లో అత్యధికంగా 55 కేసులు, గోల్కొండలో 44 కేసులు నమోదు అయ్యాయి. దాదాపు 27 టన్నులకు పైగా నకిలీ అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. రసాయనాలతో మగ్గబెట్టిన 25.8 టన్నుల పండ్లను అధికారులు సీజ్ చేశారు. 60 టన్నులకు పైగా చికెన్ వ్యర్థాలు, 15 టన్నుల నాణ్యతలేని చికెన్, మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. హెచ్-ఫాస్ట్ అధికారుల దాడుల్లో కల్తీ కోవా, పనీర్, పెరుగు, నెయ్యి, క్రీమ్, టీ పొడి భారీగా పట్టుబడింది. ఆరోగ్యానికి హానికరమైన 247 కేసులను జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ విభాగానికి బదిలీ చేశారు. ప్రజల ఫిర్యాదుల ఆధారంగా 90 కేసులు నమోదవగా... పనీర్ అవుట్‌లెట్లపై 70 కేసులు నమోదు అయ్యాయి. నాణ్యమైన ఆహారం విషయంలో హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలకు హెచ్-ఫాస్ట్ అధికారులు కఠిన మార్గదర్శకాలు జారీ చేశారు. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్, FIFO విధానం, వాడిన నూనె పునర్వినియోగంపై ఆంక్షలు విధించారు. కల్తీ మాఫియాపై అవసరమైతే పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని సీపీ వీసీ సజ్జనర్ హెచ్చరిక జారీ చేశారు. ప్రతి రోజు సగటున 15 కల్తీ ఆహార ఫిర్యాదులు అందుతున్నట్లు వెల్లడించారు. కల్తీ సమాచారం ఉంటే డయల్ 100, H-FAST వాట్సాప్, ఫోన్ నంబర్ 8712661212కు సమాచారం ఇవ్వాలని సీపీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. అల్లూరి జయంతి.. సీఎం చంద్రబాబు