
అమెరికాతో ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంపై కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇతర దేశాల కంటే భారతీయ ఉత్పత్తులకు ప్రత్యేక ప్రయోజనం లభించని పక్షంలో అగ్రరాజ్యంతో ఎలాంటి ఒప్పందంపై సంతకం చేయబోమని స్పష్టం చేశారు.లండన్ పర్యటనలో మాట్లాడిన ఆయన భారత ఎగుమతిదారులకు అమెరికా మార్కెట్లో ప్రత్యేక అవకాశాలు కల్పించేలా చట్టపరమైన, విధానపరమైన వ్యవస్థను అమెరికా రూపొందించాల్సి ఉందన్నారు. ఆ అంశం ఖరారయ్యే వరకు ఒప్పందం కుదరదని తేల్చిచెప్పారు. భారత్-అమెరికా మధ్య జరుగుతున్న చర్చల్లో దిగుమతి సుంకాల తగ్గింపు కీలక అంశంగా మారింది. గతంలో భారత ఉత్పత్తులపై దాదాపు 50 శాతం వరకు ఉన్న సుంకాలను 18 శాతానికి తగ్గించే ప్రతిపాదన ఆధారంగా చర్చలు సాగాయని గోయల్ వెల్లడించారు. అలా జరిగితే భారత ఉత్పత్తులకు ఇతర దేశాల కంటే అమెరికా మార్కెట్లో ప్రయోజనం లభిస్తుందని పేర్కొన్నారు.అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమిసన్ గ్రీర్‌తో ఇటీవల ఢిల్లీలో జరిగిన చర్చల అనంతరం కూడా ఇరు దేశాలు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తరించేందుకు కట్టుబడి ఉన్నాయని కేంద్ర వాణిజ్య శాఖ తెలిపింది. అయితే పెండింగ్‌లో ఉన్న కీలక అంశాలపై ఇంకా తుది నిర్ణయం రాలేదు. ఈ ఏడాది ప్రారంభంలో మధ్యంతర వాణిజ్య ఒప్పందం దిశగా చర్చలు మొదలైనప్పటి నుంచి ఇది మూడో విడత చర్చలు కావడం విశేషం