
అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు కీలక మలుపు తిరిగాయి. స్విట్జర్లాండ్ వేదికగా చర్చలు మొదలు కాగా.. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు, హర్ముజ్ జలసంధి మూసివేత, ఆర్థిక ఆంక్షలు ప్రధాన అడ్డంకులుగా మారాయి. చర్చలు కొనసాగుతుండగానే మరోసారి దాడులు చేస్తామంటూ ట్రంప్ హెచ్చరించగా.. ఇరాన్ అందుకు ధీటుగానే స్పందిస్తూ వాకౌట్ చేసింది. ఈ పరిణామాలు మిడిల్‌ఈస్ట్‌లో ఉద్రిక్తతల వేడిని మరింత పెంచేలా కనిపిస్తున్నాయి. అత్యంత విలాసవంతమైన బర్గెన్‌స్టాక్ రిసార్ట్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య ఆదివారం తొలి విడత శాంతి చర్చలు జరిగాయి. గత వారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ మధ్య కుదిరిన తాత్కాలిక యుద్ధ విరమణ ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లడమే ఈ సమావేశాల ప్రధాన లక్ష్యం. అమెరికా తరఫున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, స్టీవ్ విట్‌కాఫ్, జారెడ్ కుష్నర్ పాల్గొనగా.. ఇరాన్ తరఫున విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ, ప్రధాన చర్చాకర్త మొహమ్మద్ బాఘేర్ ఘాలిబఫ్ హాజరయ్యారు. పాకిస్తాన్, ఖతర్ ఈ చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. అయితే.. చర్చలకు ముందు ఘాలిబఫ్ ఖతర్, పాకిస్తాన్ ప్రతినిధులతో విడివిడిగా సమావేశమయ్యారు. ఆ తర్వాత నాలుగు పక్షాల చర్చలు ప్రారంభమయ్యాయి. సుమారు 80 నిమిషాల పాటు సాగిన తొలి విడత సమావేశంలో యుద్ధ విరమణ అమలు, ఆర్థిక ఆంక్షల సడలింపు, ఇరాన్‌కు చెందిన విదేశీ నిధుల విడుదల, చమురు ఎగుమతులపై పరిమితుల తొలగింపు వంటి అంశాలపై చర్చ జరిగింది. అయితే చర్చల ఆరంభంలోనే.. లెబనాన్ అంశం ప్రధాన అడ్డంకిగా మారింది. తాత్కాలిక ఒప్పందంలోని మొదటి నిబంధన అయిన "అన్ని రంగాల్లో కాల్పుల విరమణ"ను అమెరికా అమలు చేయలేదని ఇరాన్ ఆరోపించింది. లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతుండటమే ఇందుకు నిదర్శనమని పేర్కొంది. లెబనాన్‌పై దాడులు ఆగేంత వరకు ఇతర అంశాలపై చర్చలు ముందుకు సాగబోవని ఇరాన్ చర్చల బృందంలోని సభ్యులు స్పష్టం చేశారు. ఇదే సమయంలో హర్ముజ్ జలసంధి అంశం కూడా చర్చల్లో ఉద్రిక్తతను