
కుటుంబ నిర్వహణ భారమే కాదు.. కుటుంబ నియంత్రణ భారం కూడా మహిళలే మోయాల్సి వస్తోందని తాజా గణాంకాలు రుజువు చేస్తున్నాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం, భారతదేశంలో ట్యూబెక్టమీ ఆపరేషన్లు చేయించుకుంటున్న మహిళలు 36.5 శాతం మంది ఉండగా, వాసెక్టమీ పద్ధతిని ఎంచుకుంటున్న పురుషులు కేవలం 0.5 శాతం మాత్రమే. శాస్త్రీయత లేని అపోహలు, లోతుగా పాతుకుపోయిన పురుషాధిక్య ధోరణులు కుటుంబ నియంత్రణ వ్యవస్థలో లింగ అసమానతలకు కారణంగా నిలుస్తున్నాయి. మహిళలనే బాధితులుగా నిలుపుతున్నాయి. దేశంలో కుటుంబ నియంత్రణ సేవల వినియోగం రికార్డు స్థాయిలో పెరుగుతున్నప్పటికీ, ఆ బాధ్యత భారం మాత్రం ఇంకా మహిళల పైనే సాగుతోంది. అందుకు సాక్ష్యమే ఈ నివేదికలు. మహిళలకు సంబంధించిన ట్యూబెక్టమీ ఆపరేషన్ చాలా క్లిష్టమైనదయినప్పటికీ, దేశంలో 36.5% మంది మహిళలు దీనిని చేయించుకుంటున్నారు. కానీ ఎంతో సులువైన, సురక్షితమైన వాసెక్టమీ చేయించుకునే పురుషుల శాతం కేవలం 0.5% మాత్రమే ఉంది. అంటే కుటుంబ నియంత్రణ పద్ధతుల్లో స్త్రీ, పురుషుల మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని ఈ గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. శాస్త్రీయత లేని అపోహలు... కుటుంబ నియంత్రణ భారమంతా మహిళలపైనే పడటానికి పురుషుల్లో ఉన్న అవగాహనా లోపం, లైంగిక సామర్థ్యం తగ్గిపోతుందనే సామాజిక, మానసిక భయాలే ప్రధాన కారణమని సర్వేలు చెబుతున్నాయి. లైంగిక విజ్ఞానం పెరిగినప్పటికీ ఇప్పటికీ చాలా మంది పురుషులు వాసెక్టమీని లైంగిక సామర్థ్యాన్ని పూర్తిగా కోల్పోయే ప్రక్రియగానే భావిస్తున్నారు. వాసెక్టమీ అనేది కేవలం శుక్రకణాలను తీసుకెళ్లే నాళాలను మూసివేసే ఒక చిన్న ప్రక్రియ మాత్రమే. దీనివల్ల పురుషుల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తికి గానీ, వారి శృంగార సామర్థ్యానికి గానీ, శారీరక శ్రమ చేసే శక్తికి గానీ ఎలాంటి నష్టం వాటిల్లదు. ఈ ఆపరేషన్ చేయించుకుంటే శరీరం బలహీనపడిపోతుందని భావించడం వల్ల, ముఖ్యంగా రోజువారీ కూలీలు, కష్టపడి పనిచేసే కార్మికులు తమ జీవనోపాధి దెబ్బతింటుందని ఈ ప్రక్రియకు దూరంగా ఉంటున్నారు. మహిళలకే పరిమితం... దేశంలో