
పెళ్లి పేరుతో అమాయక మహిళలను నమ్మించి, కోట్ల రూపాయల సొమ్మును దోచుకుంటున్న ఒక ఘరానా కేటుగాడిని మహారాష్ట్ర పోలీసులు ఎట్టకేలకు చెరసాల పాలు చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అనూజ్‌కుమార్ చంద్రప్రకాష్ త్రివేది అనే నిందితుడు ఏకంగా 25 మందికి పైగా మహిళల జీవితాలతో ఆడుకుని వారిని భారీగా దగా చేశాడు. ఒక బాధిత వృద్ధురాలు స్థానిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సాగిన లోతైన దర్యాప్తులో ఈ షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పరిశీలిస్తే.. మహారాష్ట్రలోని ఠాణే పోలీసులను మార్చి 2022లో ఒక వృద్ధురాలు ఆశ్రయించారు. ఒక ప్రముఖ వార్తాపత్రికలో వచ్చిన పెళ్లి ప్రకటన ద్వారా పరిచయమైన వ్యక్తి, 2019లో తన మనవరాలిని వివాహం చేసుకున్నాడని ఆమె తెలిపారు. అయితే ఆ వరుడు తన అసలు పేరును పూర్తిగా దాచిపెట్టి, అజయ్ అగర్వాల్ అనే నకిలీ పేరుతో తమను నమ్మించి ఘోరంగా వంచించాడని సదరు వృద్ధురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.లక్షల రూపాయిల నగదు, బంగారంతో మాయం.. వివాహం జరిగిన కొద్ది రోజులకే కొత్త ఇల్లు కట్టాలని, అలాగే మరో ఫ్లాట్ కొనాలంటూ బాధితులపై నిందితుడు తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చాడు. ఈ క్రమంలోనే పలు విడతలలో వారి నుంచి సుమారు రూ.82 లక్షల నగదును గుంజాడు. ఆ తర్వాత ఫిబ్రవరి 2022లో బంధువుల పెళ్లికి వెళ్తున్నానని నమ్మబలికి, ఇంట్లోని సుమారు 33 తులాల విలువైన బంగారు ఆభరణాలతో పరారయ్యాడు. దీనిపై బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు జరిపారు.దర్యాప్తులో త్రివేది సాగించిన మ్యాట్రిమోనియల్ మోసాల చిట్టా బయటపడింది. పెళ్లిళ్ల సాకుతో వివిధ మ్యాట్రిమోనియల్ ప్లాట్‌ఫామ్‌లలో వితంతువులు, దివ్యాంగులు, నిస్సహాయ స్థితిలో ఉన్న ఒంటరి మహిళలను అతడు లక్ష్యంగా చేసుకునేవాడు. వారిపై అమితమైన ప్రేమ, సానుభూతి నటిస్తూ పెళ్లిళ్లు చేసుకుని, ఆపై నగదు, బంగారంతో చల్లగా జారుకునేవాడు.