
రాజకీయాల్లో విజయానికి పెద్ద పెద్ద సభలు, ఘాటు విమర్శలు, నిత్యం వార్తల్లో ఉండే హడావిడి తప్పనిసరి కాదని నిరూపించిన నాయకుడు విజయ్. వెండితెరపై స్టార్‌గా కోట్లాది అభిమానులను సంపాదించిన ఆయన.. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా అదే నిశ్శబ్ద శైలిని కొనసాగించారు. కానీ ఆ మౌనం బలహీనత కాదు!. విమర్శలు, అవమానాలు, వ్యక్తిగత విషాదాలు, ఎన్నో ఒడిదొడుకులను దాటుకుంటూ ఆయన ఈ స్థాయికి వచ్చారు. బయటకు కనిపించే విజయ్ కథ ఒకటైతే.. ఆయన విజయానికి పునాది వేసిన మరో కథ ఉంది. చాలా మందికి తెలియని ఆ ప్రయాణం పరిశీలిస్తే.. తమిళ సినీ దర్శకుడు ఎస్.ఏ. చంద్రశేఖర్, శోభ దంపతుల కుమారుడిగా సినీ కుటుంబంలో జన్మించిన విజయ్, చిన్న వయసులోనే కెమెరా ముందుకు వచ్చారు. అయితే ఆయన బాల్యం పూర్తిగా ఆనందంగా సాగిపోలేదు. విజయ్‌కు ఎంతో ఇష్టమైన సోదరి విద్య చిన్న వయసులోనే అనారోగ్యంతో మరణించింది. ఆ ఘటన విజయ్‌ను తీవ్రంగా కలచివేసిందని ఆయన కుటుంబ సభ్యులు పలుమార్లు చెప్పారు. సోదరి మరణం తర్వాత విజయ్ మరింత మౌనంగా మారిపోయారని, తన భావోద్వేగాలను బయటకు వ్యక్తపరచడం తగ్గించారని చెబుతుంటారు. నేటికీ ఆయన నిర్మించిన కొన్ని సంస్థలు, సేవా కార్యక్రమాల్లో ‘విద్య’ పేరు కనిపించడం ఆ అనుబంధానికి నిదర్శనం. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించిన విజయ్.. హీరోగా మారిన తొలి రోజుల్లో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. నటన రాదని, స్టార్ మెటీరియల్ కాదని, తండ్రి అండతో మాత్రమే అవకాశాలు వస్తున్నాయని విమర్శకులు ఎద్దేవా చేశారు. కానీ విజయ్ ఎప్పుడూ మాటలతో సమాధానం ఇవ్వలేదు. ప్రతి సినిమాతో తనను తాను నిరూపించుకుంటూ ముందుకు సాగారు. అదే ఆయన వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది. కాలక్రమంలో తమిళ సినీ పరిశ్రమలో అగ్రనటుడిగా ఎదిగిన విజయ్‌ను ప్రత్యేకంగా నిలబెట్టింది కేవలం స్టార్‌డమ్ కాదు.. ప్రజలతో ఏర్పరచుకున్న అనుబంధం. విద్యార్థులకు ప్రోత్సాహం, పేదలకు సాయం, ప్రకృతి విపత్తుల సమయంలో బాధితులకు అండగా నిలవడం