బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది.. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా ఈదురు గాలులతోపాటు.. ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉత్తర అండమాన్‌కు సమీపంలో, తూర్పు మధ్య బంగాళాఖాత ప్రాంతంలో ఒక అల్పపీడన ప్రాంతం కేంద్రీకృతమై ఉందని APSDMA MD ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది ఇవ్వాల్టికి తుఫానుగా, మంగళవారం తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం ఉందని తెలిపారు. బుధవారం ఉదయానికల్లా ఇది దక్షిణ ఒడిశా-ఉత్తర ఆంధ్ర తీరాల సమీపంలోని పశ్చిమ మధ్య-వాయువ్య బంగాళాఖాత ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రభావం వల్ల మంగళవారం విస్తారంగా భారీ వర్షాలు, బుధ, గురువారాల్లో చెదురుమదురుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.