ఎవరు? వీటి వెనుకున్న మాస్టర్ మైండ్ ఎవరిది? అన్నది సిరీస్.
vadhandhi season 2 Review telugu || మృతదేహాలు లభ్యమైతేనే అవి ఎవరివో గుర్తించే సరికి రోజులు, నెలలు గడిచిపోతున్న రోజులివి. అలాంటిది కేవలం అస్థిపంజరాలు, బ్రేస్లెట్ ఆధారంగా ఒక పోలీస్ ఆఫీసర్ ఈ కేసును ఎలా ఛేదించాడన్న కథాంశాన్ని ఆద్యంతం అలరించేలా తీర్చిదిద్దడంలో దర్శక-రచయిత ఆండ్రూ లూయిస్ మంచి మార్కులే కొట్టేశారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్, డ్రామా, సస్పెన్స్, థ్రిల్ ఇలా అనేక అంశాల కలబోతగా తీర్చిదిద్దడం, ప్రతి విషయాన్నీ డీటెయిలింగ్ చెప్పాలనుకోవడంతో వెబ్‌సిరీస్ నిడివి పెరిగింది. అది కాస్త ఓపికగా చూస్తే, మాత్రం ఒక మంచి థ్రిల్లింగ్ సిరీస్ చూశామన్న అనుభూతి మాత్రం కలుగుతుంది. అస్థిపంజరం బయటపడే సన్నివేశాలతోనే సిరీస్‌ను ఆసక్తిగా మొదలు పెట్టి, ఆ వెంటనే కథానాయకుడిని రంగంలోకి దించి, నేరుగా మనల్ని కూడా కథా ప్రపంచంలోకి తీసుకెళ్లిపోయాడు దర్శకుడు.
బ్రేస్లెట్ ఆధారంగా మొదలు పెట్టిన ఇన్వెస్టిగేషన్ ఒక్కో దశను దాటుకుంటూ హత్యకు గురైన వాళ్లు మణి ప్రేయసి నీలవతి, సోదరి వెన్బా (దీపిక ఆనంద్)గా గుర్తించడంతో ఈ కేసు కొలిక్కి వచ్చిందని అందరూ అనుకుంటారు. కానీ, అందరికీ భిన్నంగా మూసా ఆలోచనే అసలు ఇన్వెస్టిగేషన్‌కు బాటలు వేస్తుంది. ఆ సందర్భంగా మూసా తీసే లాజిక్‌లు, కేసు మరో కోణం నుంచి విచారించాలన్న ఆలోచన ఆసక్తికరంగా ఉంటుంది. ఎప్పుడైతే కేసు రీ-ఇన్వెస్టిగేషన్‌కు అనుమతి లభిస్తోందో.. ఇది కూడా త్వరత్వరగా అయిపోతుందనుకున్న ప్రేక్షకుడి సహనానికి కాస్త పరీక్ష పెడుతుంది.
వరుసగా జరిగే డీఎన్ఏ టెస్ట్‌లు, వేరే హత్యలతో అవి మ్యాచ్ అవడం, సీరియల్ కిల్లర్ అంటూ మరో కొత్త అంశం తెరపైకి రావడంతో అసలు కథ పక్కదారి పట్టిందేమో అనిపిస్తుంది. ఎప్పుడైతే ఇదంతా మానవ తప్పిదం వల్ల జరిగిందని మూసా గుర్తిస్తాడో అప్పటి నుంచి ఇన్వెస్టిగేషన్ మరో మలుపు తీసుకుంటుంది. చివరి రెండు ఎపిసోడ్స్‌లో ఒక్కో చిక్కుముడిని విప్పుతూ తీర్చిదిద్దిన సన్నివేశాలతో సిరీస్ పరుగులు పెడుతుంది. ముఖ్యంగా చివరి ఎపిసోడ్లో వరుస ట్విస్ట్‌లు రివీల్ అవ్వడం, హత్యల వెనుకున్న కారణం ఇలా ప్రతిదీ థ్రిల్ పంచుతుంది. ప్రస్తుతం సమాజంలో మానవ సంబంధాలు, ప్రేమ వ్యవహారాలు, ఆ ప్రేమను అంగీకరించలేని మనిషి మనస్తత్వాలు ఇలా అనేక అంశాలను ఈ హత్యలకు కనెక్ట్ చేసిన విధానం కొత్తగా ఉంది.
vadhandhi season 2 Cast And Crew || ఎస్సై మూసా రాజాగా శశికుమార్ (M. Sasikumar) నటన కూల్‌గా ఉంది. ఆ పాత్రలో అతి ఎక్కడా కనిపించదు. తనపై తనకు నమ్మకం ఎక్కువ. ఆ పాత్రకు ఉండే లక్షణాలను ఆకళింపు చేసుకుని శశి తెరపై కనిపించిన విధానం బాగుంది. ఎస్పీ రతికా నాయర్‌గా అనఘ, రామర్గా వివేక్ ప్రసన్న చక్కగా నటించారు. వివేక్ అక్కడక్కడా నవ్వులు పూయించారు. సాంకేతికంగా సిరీస్ బాగుంది. గ్రామీణ నేపథ్యం, లొకేషన్లు కథకు మరింత సహజత్వాన్ని తీసుకొచ్చాయి. నిజమైన హంతుకులు, దాని వెనుకున్న కారణం ఏంటో చివరి వరకూ ప్రేక్షకుడికి తెలియకుండా కథ, కథనాలను నడపడంలో ఆండ్రూ లూయిస్ విజయం సాధించారు. అయితే, 8 ఎపిసోడ్స్ కారణంగా సుదీర్ఘంగా సాగినట్లు అనిపిస్తుంది. నిడివి కాస్త తగ్గించి ఉంటే సిరీస్ మరింత వేగంగా ఉండేది. దర్శక ద్వయం పుష్కర్, గాయత్రి (pushkar and gayatri series) సిరీస్‌ను ప్రజెంట్ చేసిన విధానం బాగుంది.
కుటుంబంతో చూడొచ్చా?: ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చు. తెలుగు ఆడియోతో అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.