
Off The Record: జెన్-జీ యువతను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ వ్యూహాలు! Off The Record: 2027 మార్చి తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలకు జరుగనున్నాయి. అధికార పార్టీకి ఇది పెద్ద సవాల్‌గా మారింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని 34 నియోజకవర్గాలు.. అలాగే ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిలాల్లోని 43 నియోజకవర్గాల్లో ఈ ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణలో మొత్తం 119 నియోజకవర్గాలు ఉంటే.. 2027 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు మొత్తం 77 నియోజకవర్గాల్లో ఉంటాయి. మరోవైపు ఇవి గ్రాడ్యుయేట్ ఎన్నికలు కావడంతో హస్తం పార్టీకి గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. ఎందుకంటే రానున్న సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికలపై ఈ రెండు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రభావం ఉండే అవకాశం లేకపోలేదు. ఒకవైపు గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్ళాలని అధికార పార్టీ కసరత్తు చేస్తోంది. సామజిక సమీకరణాలు సైతం పక్కకు పెట్టి రెండు సీట్లు ఒకే వర్గానికి ఇచ్చిన పర్వాలేదు.. కానీ పక్కాగా గెలవడమే టార్గెట్ అంటోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన కసరత్తుకు శ్రీకారం చుట్టింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. జిల్లా ఇంఛార్జ్ మంత్రులు, జిల్లా మంత్రులు, నాయకులు.. సమావేశాలు పెట్టి పలు లోకల్ నాయకుల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఇందులో ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల నుంచి ప్రధానంగా మాజీ విజయ డైరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి కుమారుడు సర్వోత్తం రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి బరిలో ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వీరితోపాటు బీసీ, యువత కోటాలో పీసీసీ జనరల్ సెక్రటరీ, ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ నేత, గౌడ సామజికవర్గానికి చెందిన చనగాని దయాకర్, అలాగే పీసీసీ అధికార ప్రతినిధి, NSUI నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటున్న ఖమ్మం జిల్లాకి చెందిన నేత బీసీ, యువత కోటలో యాదవ సామజికవర్గం నుంచి లోకేష్ యాదవ్‌లు టికెట్ ఆశిస్తున్నారు