
ఢిల్లీలో జరుగుతున్న మొదటి టీ20 సమరంలో మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్ (Azmatullah Omarzai) అర్ధశతకం సాయంతో 156 పరుగుల పోరాడే స్కోరు సాధించింది. 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్‌గా వచ్చిన సంజు శాంసన్ రెండు బౌండరీలతో మంచి ఆరంభం ఇచ్చినట్లే కనిపించాడు. ఆ వెంటనే ఒమర్జాయ్ వేసిన బంతిని పుల్ చేయబోయి సరిగ్గా టైమింగ్ కుదరకపోవడంతో 8 బంతుల్లో 10 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. వరుసగా లభిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో శాంసన్ విఫలం కావడంపై క్రికెట్ అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అతడి స్థానంలో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) కి తుది జట్టులో అవకాశం ఇచ్చి ఉండాల్సిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.





