
ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మాజీ మేనేజర్‌ దిశా శాలియన్‌ (Disha Salian) మృతి కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ( CBI ) ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. అందులో మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే (Aaditya Thackeray), నటులు డినో మోరియా, రియా చక్రవర్తి (Rhea Chakraborty) పేర్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. హత్య, సామూహిక అత్యాచారం, సాక్ష్యాలను ధ్వంసం చేయడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కేసు దర్యాప్తును బాంబే హైకోర్టు సీబీఐకి అప్పగించిన రెండు వారాల తర్వాత ఎఫ్‌ఐఆర్‌ నమోదయ్యింది. ‘ఈ ఘటన జరిగిన సమయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ఉద్ధవ్‌ ఠాక్రే ఈ కేసును బయటకు రాకుండా చేయడానికి అనేక ప్రయత్నాలు చేశారు. ఆ తర్వాత సాక్ష్యాలను కప్పిపుచ్చడంలోనూ కీలక పాత్ర పోషించారు. ఆయన ఆదేశాల మేరకే ప్రభుత్వ అధికారులు, పోలీసులు కేసు పత్రాలు, ఇతర ప్రభుత్వ రికార్డులను ధ్వంసం చేశారు. ఇందుకుగాను వారందరూ విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని అధికారులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. మరోవైపు, దిశ మరణానికి సంబంధించిన అన్ని పత్రాలు, రికార్డులను తమకు అందించాలని దర్యాప్తు సంస్థ పోలీసులకు లేఖ రాసింది. దిశా శాలియన్‌ (Disha Salian) 2020 జూన్‌ 8న అనుమానాస్పద స్థితిలో మరణించారు. పోలీసులు ఆమెది ఆత్మహత్యగా తేల్చారు. ఆమె చనిపోయిన రోజుల వ్యవధిలోనే నటుడు సుశాంత్ తన ఫ్లాట్‌లో శవమై కనిపించారు. ఈ కేసు మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. ఆ సమయంలో అధికారంలో ఉన్న ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వం.. ఈ కేసును కప్పిపుచ్చేందుకు యత్నించిందనే ఆరోపణలు వచ్చాయి. రెండు వారాల క్రితం ఈ కేసుపై దిశ తండ్రి సతీశ్‌ శాలియన్‌ మరోసారి బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ప్రముఖ వ్యక్తులపై ఆరోపణలున్నాయని.. వారి ప్రభావం వల్లే పోలీసులు దర్యాప్తును ముందుకు కదలనివ్వట్లేదని ఆరోపించారు. తమ కుమార్తె మృతి విషయంలో మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే, నటులు సూరజ్‌ పంచోలి, డినో మోరియా మొదలైన వారి ప్రమేయం ఉందన్నారు. దీంతో ఈ కేసు దర్యాప్తును న్యాయస్థానం సీబీఐకి అప్పగించింది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. దేశ రాజధాని దిల్లీలో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు (BRICS Summit) ఘనంగా జరిగింది.




