
హైదరాబాద్‌: మాజీ సీఎం రోశయ్య దూరదృష్టి వల్లే తెలంగాణకు మిగులు బడ్జెట్‌ వచ్చిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ( Revanth Reddy )అన్నారు. ఉప్పల్‌ భగాయత్‌లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవనానికి సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. ఆగర్భ శ్రీమంతులకే కాదు, పేద ఆర్యవైశ్యుల బిడ్డలకు కూడా ఈ భవనం ఉపయోగపడాలన్నారు. ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవనం భవిష్యత్‌ తరాలకు పునాదులు వేయాలని ఆకాంక్షించారు. భవన నిర్మాణానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని సీఎం హామీ ఇచ్చారు. ఆర్యవైశ్యులు సౌమ్యులు, ఆత్మాభిమానం కలిగిన వారని.. పేదరికం ఉన్నా కడుపులో దాచుకుంటారని కొనియాడారు.
‘‘గతంలో సీఎంలు ఎంత మంది మారినా ఆర్థికమంత్రిగా రోశయ్యనే ఉండేవారు. సుదీర్ఘకాలం నేను రాజకీయాల్లో రాణిస్తానని ఆయన గుర్తించారు. అసెంబ్లీలో దూకుడుగా మాట్లాడుతుంటే ఆవేశం తగ్గించుకోవాలని చెప్పేవారు. ఆవేశానికి ఆలోచన తోడయితే.. భవిష్యత్‌ ఉంటుందని సలహా ఇచ్చారు. రోశయ్య ఎవరినైనా విమర్శిస్తారు కానీ, దూషించరు. హైదరాబాద్‌తోనే నా అనుంబంధం ముడిపడి ఉందని రోశయ్య ఎప్పుడూ చెప్పేవారు. అందుకే ఆయన విగ్రహం హైదరాబాద్‌లో ఉండాలని నిర్ణయించాం. ఆర్యవైశ్యులు ఆర్థిక క్రమశిక్షణ కలిగిన వారు. ఆర్థిక లావాదేవీల్లో సలహాల కోసం వారినే అడుగుతారు. ఆర్యవైశ్యులంతా కలిసికట్టుగా ఉండి రాజకీయాల్లో మీ వాటా సాధించుకోవాలి’’ అని సీఎం అన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.






