
సినిమాను బాగా వచ్చేంతవరకూ చెక్కుతారనే రాజమౌళికి ‘జక్కన్న’ అని పేరు పెట్టారు ఎన్టీఆర్. ఈ విషయాన్ని పలు వేదికలపై ఆయన చెప్పారు కూడా. ఈ పర్ఫెక్షనిజం వల్లే రాజమౌళి సినిమాలు ఏడాదికి పైగా చిత్రీకరణ జరుపుకుంటూ ఉంటాయి. అయితే.. ఈ సారి మాత్రం రాజమౌళి పంథా మార్చారు. ‘వారణాసి’ సినిమాను వేగంగానే పూర్తి చేశారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఎస్.ఎస్.కార్తికేయ ఇటీవలే తెలిపారు. ‘వారణాసి’ షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చిందని, చాలా గ్రాండ్ స్కేల్లో సినిమా ఉండబోతున్నదని ఆయన తెలియజేశారు. అనుకున్న సమయానికే ‘వారణాసి’ విడుదల కానున్నదని తన ప్రకటన ద్వారా కార్తికేయ ధృవీకరించడంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. హాలీవుడ్ మార్కెట్‌పై దృష్టి పెట్టిన మేకర్స్ ఈ సినిమాను ఐమ్యాక్స్ వెర్షన్లో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు కెరీర్‌కి ‘వారణాసి’ మేలిమలుపు కానున్నదనడంలో సందేహం లేదు. ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఎం.ఎం.కీరవాణి సంగీత దర్శకుడు.




