
హైదరాబాద్‌ను స్వచ్ఛమైన, పర్యావరణహిత ప్రజా రవాణా నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్న ఎలక్ట్రిక్ ఆటో మార్పిడి పథకంపై రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా అర్హత కలిగిన ప్రతి ఆటో యజమానికి రూ.1.50 లక్షల వరకు సబ్సిడీ అందిస్తామని ఆయన వెల్లడించారు. అర్హత ప్రమాణాలు పూర్తి చేసే ప్రతి లబ్ధిదారుడికి సమానంగా పథకం ప్రయోజనం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ ఆటోల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు ‘తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ మార్పిడి పథకం–2026’ను రూపొందిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. నగరంలో వాయు, శబ్ద కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ప్రజా రవాణాను పర్యావరణహితంగా మార్చడం ఈ పథకం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. తెలంగాణ రైజింగ్ విజన్–2047 లక్ష్యాలకు అనుగుణంగా దీర్ఘకాలిక రవాణా ప్రణాళికలో భాగంగా ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు.పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు ప్రభుత్వం సుమారు రూ.200 కోట్లతో ఈ పథకాన్ని అమలు చేయనుంది. ఇందుకు రాష్ట్ర కేబినెట్ ఇటీవల ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. పథకం ద్వారా పాత ఇంధన వాహనాల సంఖ్యను క్రమంగా తగ్గించి, నగర రవాణా వ్యవస్థలో ఎలక్ట్రిక్ ఆటోల వాటాను పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఎలక్ట్రిక్ ఆటోగా మారాలనుకునే అర్హత కలిగిన యజమానులకు ప్రభుత్వం రెండు ఆప్షన్లు కల్పించనుంది. మొదటి అవకాశంలో ప్రస్తుతం వినియోగిస్తున్న పెట్రోల్ లేదా డీజిల్ ఆటోను AIS–123 ప్రమాణాలకు అనుగుణంగా ఆమోదం పొందిన ఎలక్ట్రిక్ కిట్‌తో రెట్రోఫిట్ చేసుకోవచ్చు. అంటే ప్రస్తుత వాహనాన్ని పూర్తిగా మార్చకుండా, అనుమతించిన సాంకేతిక విధానంలో ఎలక్ట్రిక్ వ్యవస్థను అమర్చుకునే అవకాశం ఉంటుంది.రెండో అవకాశంలో పాత ఆటోను ప్రభుత్వ నిర్దేశిత విధానంలో అప్పగించి, దాని స్థానంలో కొత్త ఎలక్ట్రిక్ ఆటోను కొనుగోలు చేసుకోవచ్చు. ఈ రెండు మార్గాల్లో ఏదైనా ఎంచుకున్నా అర్హత కలిగిన ఆటో యజమానికి గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. దీంతో తమ అవసరాలకు అనుగుణంగా పాత వాహనాన్ని ఎలక్ట్రిక్‌గా మార్చుకోవాలా, కొత్త ఈవీ కొనుగోలు చేయాలా అనే నిర్ణయాన్ని యజమానులే తీసుకునే అవకాశం ఉంటుంది.ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా ఆటో డ్రైవర్ల నిర్వహణ వ్యయం పెరుగుతోంది. ఇంధన ఖర్చు తగ్గితే డ్రైవర్లకు రోజువారీ ఆదాయంలో కొంత ఉపశమనం లభించే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఎలక్ట్రిక్ ఆటోల వినియోగం పెరగడం ద్వారా నగరంలో వాయు కాలుష్యంతో పాటు శబ్ద కాలుష్యాన్ని కూడా తగ్గించవచ్చని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ప్రజా రవాణా వ్యవస్థను మరింత పర్యావరణహితంగా మార్చడంతో పాటు ఆటో డ్రైవర్ల ఆర్థిక ప్రయోజనాలను కూడా కాపాడేలా పథకాన్ని రూపొందిస్తున్నామని పొన్నం ప్రభాకర్ తెలిపారు. దరఖాస్తులు, అర్హత పరిశీలన, వాహన ధ్రువీకరణ, సబ్సిడీ చెల్లింపులకు సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం త్వరలోనే వెల్లడించనుంది.





