© 2026 nimisham.in

ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న గోదావరి జలాల కల సాకారమైంది. పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా తొలిసారిగా గోదావరి నీటిని ఉత్తరాంధ్ర వైపు విడుదల చేశారు.
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం పీఎల్ పురం వద్ద సీఎం చంద్రబాబు నాయుడు రెగ్యులేటర్‌ను ప్రారంభించి జలప్రవాహానికి శ్రీకారం చుట్టారు. అంతకుముందు కాలువ శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ఆయన గోదావరికి జలహారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రూ.4,192 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ కాలువ ద్వారా ఏలేరు కాలువకు నీటిని అందించడంతో పాటు అనకాపల్లి జిల్లాలోని 110 చెరువులను నింపే ప్రణాళిక ఉంది. దీంతో సాగునీరు, తాగునీటి అవసరాలకు భరోసా లభించడంతో పాటు భూగర్భ జలాలు మెరుగుపడి ఈ ప్రాంత అభివృద్ధికి కొత్త ఊపు వచ్చే అవకాశం ఉంది.
పోలవరం ఎడమ ప్రధాన కాలువ పోలవరం ప్రాంతం నుంచి ప్రారంభమై తూర్పు దిశగా విస్తరిస్తుంది. గోదావరి జలాలను కొండ ప్రాంతాల నుంచి మైదాన ప్రాంతాలకు తరలించేలా దీని మార్గాన్ని రూపొందించారు. ప్రారంభ ప్రాంతంలోనే కొండను తొలిచి సొరంగ మార్గం ఏర్పాటు చేయడం ఈ ప్రాజెక్టులో కీలకమైన ఇంజినీరింగ్ ప్రత్యేకత. సుమారు 914 మీటర్ల పొడవుతో నిర్మించిన సొరంగం ద్వారా గోదావరి జలాలు ముందుకు సాగుతాయి. ఆ తర్వాత వివిధ ప్రాంతాల గుండా ప్రవహిస్తూ కాకినాడ, అనకాపల్లి మీదుగా విశాఖ ప్రాంతానికి చేరేలా కాలువ వ్యవస్థను రూపొందించారు. ఈ మార్గంలో పుష్కర, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. పోలవరం హెడ్‌వర్క్స్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే వరకు ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిని తరలించే విధానాన్ని అమలు చేస్తున్నారు. భవిష్యత్‌లో పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత గ్రావిటీ ద్వారా నీరు సహజ ప్రవాహంతోనే ముందుకు సాగేలా ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతం నిర్మించిన ప్రధాన కాలువతో పాటు తాగునీటి పంపిణీ వ్యవస్థలను కలుపుకొని సుమారు 213 కిలోమీటర్ల మేర జలమార్గాన్ని అభివృద్ధి చేశారు.
పోలవరం ఎడమ కాలువ నిర్మాణం సాధారణమైన పని కాదు. కాలువ మార్గంలో ఎత్తైన కొండలు ప్రధాన అడ్డంకిగా మారాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ రాతి కొండలను తొలిచి కాలువ స్థాయికి తీసుకురావాల్సి వచ్చింది. ఇందుకోసం ఆధునిక యంత్రాలు, ప్రత్యేక నిర్మాణ పద్ధతులను ఉపయోగించారు. కాలువ మార్గంలో ఏలేరు, పంపా, తాండవ, వరాహ, శారద వంటి నదులు అడ్డుగా వచ్చాయి. వీటిని దాటేందుకు ప్రత్యేక ఇంజినీరింగ్ నిర్మాణాలు చేపట్టారు. కొన్ని చోట్ల సైఫన్లు, మరికొన్ని చోట్ల భారీ అక్విడెక్టులు నిర్మించారు. అంటే నది ప్రవాహానికి ఆటంకం కలగకుండా, అదే సమయంలో కాలువలోని గోదావరి నీరు తన మార్గంలో సాగేలా రెండు వేర్వేరు జలమార్గాలను రూపొందించారు. తాండవ నదిపై భారీ అక్విడెక్ట్ నిర్మించడం ఈ ప్రాజెక్టులోని ముఖ్యమైన పనుల్లో ఒకటి. అలాగే వరాహ నదిపై కూడా పెద్ద నిర్మాణాన్ని చేపట్టారు.
చిన్న వాగులు, ఏర్లను దాటేందుకు సూపర్ పాసేజ్లను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారితో పాటు ఇతర ప్రధాన రహదారులను పలు చోట్ల కాలువ దాటాల్సి వచ్చింది. రవాణాకు ఆటంకం కలగకుండా వంతెనలు, ప్రత్యేక క్రాసింగ్ నిర్మాణాలు చేపట్టారు. కొన్ని ప్రాంతాల్లో భూసేకరణ, పునరావాస సమస్యలు కూడా పనులకు ఆటంకంగా మారాయి. గ్రామాల తరలింపు, భూ వివాదాల పరిష్కారం తర్వాతే నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. ఒక ప్రాంతంలో కొండను దాదాపు 87 మీటర్ల వరకు తొలిచి కాలువ నిర్మాణానికి మార్గం సిద్ధం చేయాల్సి వచ్చింది.
పోలవరం ఎడమ కాలువలో అత్యంత ముఖ్యమైన ప్రత్యేకత దీని ఇంజినీరింగ్ డిజైన్. భారీ పంపులపై ఆధారపడకుండా సాధ్యమైనంత వరకు సహజ వాలును ఉపయోగించి నీరు ప్రవహించేలా దీన్ని రూపొందించారు. దీనివల్ల భవిష్యత్‌లో విద్యుత్ వినియోగం, నిర్వహణ వ్యయం తగ్గే అవకాశం ఉంటుంది. కాలువ పూర్తి సామర్థ్యం సెకనుకు సుమారు 17,500 క్యూసెక్కుల నీటిని తరలించేలా రూపొందించారు. భారీ వరదల సమయంలో గోదావరి నుంచి వచ్చే జలాలను ఉత్తరాంధ్ర వైపు మళ్లించేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడనుంది.
నీటి ప్రవాహ వేగం అధికంగా ఉండే ప్రాంతాల్లో కాలువ నిర్మాణానికి నష్టం కలగకుండా ప్రత్యేక పూల్స్ ఏర్పాటు చేశారు. వేగంగా వచ్చే నీరు ఈ పూల్స్‌లోకి చేరి కొంత నెమ్మదించిన తర్వాత మళ్లీ ముందుకు ప్రవహించేలా డిజైన్ చేశారు. కాలువ పొడవునా నీటి వృథాను తగ్గించేందుకు బలమైన కాంక్రీట్ లైనింగ్ చేశారు. దీంతో నీరు భూమిలో ఇంకిపోకుండా, నిర్ణీత పరిమాణంలో ముందుకు సాగే అవకాశం ఉంటుంది. నదులను దాటే ప్రాంతాల్లో అక్విడెక్టులు, సైఫన్లు నిర్మించడం మరో విశేషం. ఏలేరు నది కిందుగా నీటిని తీసుకెళ్లే సైఫన్ నిర్మాణం చేపట్టగా, పంపా వంటి నదులపై అక్విడెక్టుల ద్వారా కాలువను కొనసాగించారు. క్లిష్టమైన భౌగోళిక పరిస్థితుల్లో కూడా నీటి ప్రవాహానికి ఎక్కడా ఆటంకం లేకుండా నిర్మాణాన్ని రూపొందించారు.
పోలవరం ఎడమ ప్రధాన కాలువ నిర్మాణానికి ఇప్పటివరకు సుమారు రూ.4,192 కోట్ల వరకు వ్యయం చేసినట్లు ప్రాజెక్టు వివరాలు చెబుతున్నాయి. వివిధ దశల్లో పనుల వ్యయం పెరగడంతో అదనపు నిధులను కేటాయించాల్సి వచ్చింది. 2019 నాటికి పెద్ద మొత్తంలో కాలువ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. అనంతరం కొన్ని ప్యాకేజీల పనులు నిలిచిపోవడంతో ప్రాజెక్టు పురోగతికి ఆటంకం ఏర్పడింది. మిగిలిన పనులను పూర్తి చేసేందుకు తర్వాతి దశలో కొత్త అంచనాలతో టెండర్లు పిలిచారు. కాలువ పూర్తి సామర్థ్యానికి అనుగుణంగా నిర్మాణాల్లో మార్పులు చేసి పనులను వేగవంతం చేశారు.
ఈ కాలువ ద్వారా భవిష్యత్‌లో మొత్తం 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్నది ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం పలు ఆయకట్టు ప్రాంతాలకు ప్రయోజనం చేకూరేలా ప్రణాళిక రూపొందించారు. పుష్కర ఆయకట్టు, ఏలేరు ఆయకట్టు, పంపా, తాండవ, వరాహ, మామిడిగెడ్డ ప్రాంతాలకు గోదావరి జలాలను అందించేలా వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు. అనకాపల్లి జిల్లాలోని పెద్ద ఎత్తున వ్యవసాయ భూములకు ఈ కాలువ ద్వారా నీరు అందే అవకాశం ఉంది.
సాగునీటితో పాటు తాగునీటి అవసరాలకూ ఈ ప్రాజెక్టు కీలకం కానుంది. విశాఖ నగరం నీటి అవసరాలు తీర్చడంతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్, ఇతర పరిశ్రమలకు కూడా గోదావరి జలాలను అందించనుంది. కాలువ ద్వారా సుమారు 23.44 టీఎంసీల వరకు గోదావరి జలాలను సాగు, తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు వినియోగించుకునే అవకాశం ఉందని అంచనా. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే వేలాది రైతు కుటుంబాలకు నీటి భరోసా లభించనుంది.
పోలవరం ఎడమ కాలువను ఉత్తరాంధ్రకు గేమ్ ఛేంజర్‌గా పేర్కొనడానికి ప్రధాన కారణం దీని భవిష్యత్ విస్తరణ ప్రణాళిక. ప్రస్తుతం కాలువ ద్వారా అనకాపల్లి, విశాఖ పరిసర ప్రాంతాలకు ప్రయోజనం కలగనుండగా, భవిష్యత్‌లో దీన్ని ఉత్తరాంధ్ర సుజల స్రవంతితో అనుసంధానించాలన్న ప్రణాళిక ఉంది.
ఈ అనుసంధానం పూర్తయితే గోదావరి జలాలను విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం వంటి ఉత్తరాంధ్ర ప్రాంతాలకు కూడా తరలించే అవకాశం ఉంటుంది. మొత్తం ఉత్తరాంధ్రలో సుమారు 8 లక్షల ఎకరాల వరకు సాగు, తాగునీటి అవసరాలకు జలభరోసా కల్పించే సామర్థ్యం ఈ అనుసంధానానికి ఉందని అంచనా.
ఇప్పటివరకు ఉత్తరాంధ్రలోని అనేక ప్రాంతాల రైతులు వర్షాధార వ్యవసాయంపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. సరైన వర్షాలు లేకపోతే వరి, మొక్కజొన్న వంటి పంటలు నష్టపోయే పరిస్థితి ఉంది. గోదావరి జలాలు అందుబాటులోకి వస్తే సాగులో స్థిరత్వం పెరగడంతో పాటు పంటల వైవిధ్యానికి అవకాశం ఏర్పడుతుంది. కూరగాయలు, పండ్ల తోటలు, చెరకు, పత్తి వంటి వాణిజ్య పంటల సాగుకు కూడా అవకాశం పెరుగుతుంది. తద్వారా రైతుల ఆదాయం పెరగడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతం లభించవచ్చు.