
శ్రీగిరిలో సాక్ష్యం చెప్పే సాక్షి గణపతి సున్నిపెంట సర్కిల్, శ్రీశైలం, న్యూస్‌టుడే: శ్రీశైల(శ్రీగిరి) మహాక్షేత్రంలో వెలసిన సాక్షిగణపతి ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. శ్రీశైలంలో మల్లికార్జునస్వామిని దర్శించుకునే భక్తులకు కైలాసంలో ఇక్కడి సాక్షి గణపతి సాక్ష్యం చెబుతాడని పురాణాలు చెబుతున్నాయి. శ్రీశైల ప్రధాన కార్యాలయానికి తూర్పున రెండు కి.మీ దూరంలో ప్రధాన రహదారిలో ఈ ఆలయం ఉంది. శ్రీశైలం దర్శించే ప్రతి భక్తుడు సాక్షిగణపతిని భక్తి విశ్వాసాలతో దర్శించుకుంటారు. శ్రీశైలక్షేత్రం దర్శనంతో అశ్వమేధ యాగఫలం లభిస్తుందని మహాభారతంలో పొందుపరిచారు. చక్కటి నల్లరాతితో మలచిన ఈ గణపతికి తొండం కుడివైపునకు ఉండి చేతితో భక్తుల పేర్లను నమోదు చేస్తున్నట్లు విగ్రహం ఉండటంతో ఆకర్షిస్తోంది. 16 స్తంభాలతో ఉన్న ప్రధాన మండపంలో లోపలి నాలుగు స్తంభాలను గోడలతో కలిపి గర్భాలయంగా తీర్చిదిద్దారు. ప్రధాన మండపానికి ముందు భాగంలో రెండు స్తంభాలు ఏర్పాటు చేసి వాటిని ప్రధాన మండపానికి కలుపుతూ ముఖమండపంగా ఏర్పాటు చేశారు. సిమెంట్‌తో నిర్మించిన ముఖమండప స్తంభాలకు నారద తుంబురులను తీర్చిదిద్దారు. ఈ క్షేత్రానికి నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఉదయం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు తెరచి ఉంటుంది. గణపతి హోమం నిర్వహిస్తుంటారు. వినాయక చవితిని పురస్కరించుకొని నవరాత్రులను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. బిక్కవోలు, న్యూస్‌టుడే: తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలుకు చెందిన శ్రీలక్ష్మీ గణపతికి చెవిలో కోరికలు చెబితే నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఇక్కడకు జిల్లా వాసులే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు కూడా వచ్చి స్వామిని దర్శించుకుంటారు. దేవాలయ ప్రాంగణంలో కుడుములు వండి స్వామివారికి నైవేద్యంగా పెట్టి మొక్కులు చెల్లించుకుంటారు. స్థల పురాణం: ఒక భక్తునికి స్వామివారు కలలో కనిపించి నేను భూమిలోనే ఉన్నానని, దేవాలయం కట్టించాలని కోరినట్లు చెబుతారు. స్వామివారు స్వయంభూగా వెలిసి రోజు, రోజుకు ఎత్తు పెరుగుతున్నారని భక్తులు విశ్వసిస్తారు. చారిత్రకంగా..: క్రీ.శ 849-892 సంవత్సరాల మధ్య కాలంలో గుణగ విజయాదిత్యుడు ఈ విగ్రహం ఏర్పాటు చేసినట్టు చెబుతారు. అయితే అనేక దండ యాత్రల్లో దేవాలయం శిథిలమై విగ్రహం భూమిలో ఉండేది. కొంత భాగం పైన కనిపించేది. ఈ మహారాజు తల్లి శిల మహాదేవి జైన మతస్థురాలు. ఆమె కోరికమేర దీన్ని నిర్మించారని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ స్వామికి తొండం కుడివైపునకు తిరిగి ఉంటుంది. ఇక్కడకు ఎలా చేరాలంటే..: ఈ గ్రామం కాకినాడకు 30 కి.మీ దూరంలోను, రాజమహేంద్రవరానికి 40 కి.మీ దూరంలోను ఉంది. కెనాల్‌ దారిన ప్రయాణించాలి. ప్రతి అరగంటకు రాజమహేంద్రవరం, కాకినాడ పట్టణాలనుంచి ఆర్టీసీ బస్సులు ఉంటాయి. భక్తుల కోర్కెలు తీర్చే దశభుజ మహాగణనాథుడు రాయదుర్గం పట్టణం, న్యూస్‌టుడే: అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో వెలసిన దశభుజ మహాగణపతి భక్తుల కోర్కెలు తీరుస్తూ పూజలందుకుంటున్నాడు. దక్షిణ భారతదేశంలో ఏకశిలలో దశ భుజాలతో ఏర్పడిన ఏకైక గణనాథుడుగా ప్రసిద్ధి చెందాడు. స్వామిని దర్శించుకునేందుకు ప్రతి ఆది, మంగళవారాలు మన రాష్ట్రంతోపాటు కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర భక్తులు తరలివస్తుంటారు. కోర్కెలను మనసులో సంకల్పించుకుని రెండు కొబ్బరి కాయలను స్వామికి సమర్పిస్తే 41 రోజుల్లో అవి తీరుతాయని భక్తుల విశ్వాసం. తమ కోర్కెలు నెరవేరగానే తిరిగి ఒక కొబ్బరికాయను భక్తులు వెనక్కి తీసుకెళ్లి ఇంటిలో ప్రత్యేక పూజలు నిర్వహించడం ఇక్కడి ఆనవాయితీ. శిరస్సుపై పూర్ణకలశంతో గంభీరంగా కనపడే స్వామి విగ్రహానికి నుదుటిన మూడో కన్ను, తొండం.. కుడి వైపు తిరిగి ఉండటం, మూలవిరాట్టుకు ఎడమ వైపు అరి కాలి భాగంలో అష్టదళ పద్మంతో సూర్య, చంద్రులు కలిగి ఉండటం ప్రత్యేకత. ఇక్కడి దశభుజ మహాగణపతి పది చేతులతో భక్తులకు దర్శనమిస్తుంటాడు. రవాణా సౌకర్యం: అనంతపురం జిల్లా కేంద్రం నుంచి రాయదుర్గానికి ఉదయం 5 గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ప్రతి అరగంటకో ఆర్టీసీ బస్సు అందుబాటులో ఉంటుంది. రైల్వే మార్గంలో రావాలనుకునే వారు గుంతకల్లు జంక్షన్‌కు వచ్చి, అక్కడి నుంచి బళ్లారి మీదుగా రాయదుర్గానికి చేరుకోవచ్చు. సత్య ప్రమాణాల దేవుడు.. కాణిపాకం వినాయకుడు న్యూస్‌టుడే, కాణిపాకం: సత్య ప్రమాణాలకు నెలవుగా కాణిపాకం స్వయంభు వరసిద్ధి వినాయకుని ఆలయం భాసిల్లుతోంది.. బహుదా నది తీరంలో వెయ్యేళ్ల క్రితం వెలసిన ఈ ఆలయంలో 21 రోజుల పాటు స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.. శివ, వైష్ణవ ఆలయాలకు నిలయమిది.. వరసిద్ధి వినాయకుని ఆలయంతో పాటు మణికంఠేశ్వరస్వామి, వరదరాజస్వామి, వీరాంజనేయస్వామి ఆలయాలు ఇక్కడ కొలువు దీరాయి. పూర్వం విహారపురి గ్రామంలో ధర్మ పరాయణులైన ముగ్గురు సోదరులు వ్యవసాయం చేస్తూ జీవించేవారు. పెద్దవాడు అంధుడిగా, రెండోవాడు మూగ, మూడోవాడు చెవిటివాడిగా జన్మించారు. గ్రామంలో ఉన్న కాస్త భూమిని సాగు చేసుకుంటూ జీవించేవారు. కాలక్రమేణా కరవుతో గ్రామం అల్లాడిపోయింది. దివ్యాంగ సోదరులు పంటల సాగుకు తమ భూమిలో బావి తవ్వడం మొదలుపెట్టారు. పెద్దరాయి అడ్డుపడటంతో పెకలించడానికి ప్రయత్నించారు. రాయికి పార తగిలింది. వెంటనే రాయి నుంచి రక్తం చిమ్మి దివ్యాంగ సోదరులపై పడి వారి వైకల్యం తొలగిపోయింది. ఈ విషయాన్ని వారు పరిసర గ్రామ ప్రజలకు వివరించారు. తండోపతండాలుగా వచ్చి పరిశీలించగా ఆ బావిలో వినాయకుడి రూపం కనిపించింది. గ్రామస్థులు పూజలుచేసి కొబ్బరికాయలు సమర్పించారు. ఆ కాయల ద్వారా వచ్చిన నీరు ‘కాణి’ భూమి పారింది. ‘కాణి’ అంటే ఎకరం. కాణి భూమి పారడంతో విహారపురి గ్రామానికి ‘కాణిపారకమ్‌’ అనే పేరొచ్చింది. క్రమేపీ అది కాణిపాకంగా వాడుకలోకి వచ్చింది. బావిలో ఉద్భవించిన కాణిపాకం వినాయకుడు నిత్యం పెరుగుతూనే ఉండటం విశేషం. ప్రమాణాల దేవుడిగా ప్రసిద్ధి: స్వామివారి ఎదుట తప్పుడు ప్రమాణాలు చేస్తే శిక్ష అనుభవిస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక్కడి పుష్కరిణిలో స్నానం చేసి ప్రమాణాలు చేయడం ప్రత్యేకం. స్వామివారి ఎదుట సామాన్య భక్తులే కాకుండా రాజకీయ నాయకులు, వ్యసనపరులు, దురలవాట్లకు బానిసలైన వారు వాటిని వీడేందుకు ప్రమాణాలు చేస్తుంటారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





