
నర్సింహులపేట, సెప్టెంబర్ 15 : మండల కేంద్రంలో ఎక్సైజ్ పోలీసుల దాడులకు నిరసనగా దంపతులు ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. మధుర వైన్స్ ఎదుట మంగళవారం దంపతులు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించడంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మండలంలోని బొజ్జన్నపేట గ్రామంలో ఎక్సెజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. గ్రామంలోని ఒక బెల్ట్ షాప్‌పై దాడి చేసి రూ.40 వేల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నారు. దాంతో, బెల్ట్ షాపు నిర్వాహకులు తీవ్ర ఆవేదనకు గురై ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఎక్సైజ్ అధికారుల దాడులను నిరసిస్తూ మండల కేంద్రంలో దంపతులు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. ఉద్దేశపూర్వకంగానే తమపై కావాలనే మధుర వైన్స్ నిర్వాహకులు తప్పుడు సమాచారం ఇచ్చి.. ఎక్సైజ్ అధికారులతో దాడులు చేయించారని దంపతులు ఆరోపించారు. ఈ క్రమంలో బెల్ట్ షాప్ నిర్వాహకులు చింతమల్ల యాకన్న, భార్య స్వాతి మంగళవారం మధుర వైన్స్ వద్ద ఆందోళనకు దిగారు. తమపై కావాలనే దాడులు చేయించారని ఆరోపిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం భార్యాభర్తలు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జిల్లాలో ఎక్కడ లేని విధంగా రెండు షాపులు సిండికేట్ అయి.. క్వార్టర్‌కు రూ. 20, ఫుల్ బాటిల్‌కు రూ.80 రూపాయల చొప్పున హోల్‌సేల్ అంటూ అమ్ముతున్నారని, తాము అక్కడే లిక్కర్ కొనుగోలు చేస్తున్నామని యాకన్న, స్వాతి దంపతులు తెలిపారు. అయినా సరే తమపై కక్ష కట్టి తమ షాపుపై దాడులు నిర్వహించి వేధింపులు గురి చేస్తున్నారని వారు ఆరోపించారు. తమకు మందు ఇవ్వకపోయినా డబ్బులు ఇప్పించాలని, సుమారు ఐదు గంటల పాటు షాపు ముందు కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయంపై తొర్రూర్ ఎస్సై ఎక్సైజ్ సీఐ అశోక్ మాట్లాడుతూ.. బెల్ట్ షాపుపై ఫిర్యాదు మేరకు తాము దాడులు నిర్వహించినట్లు తెలిపారు.