
‘ఎం.ఎస్‌’ చిత్ర ప్రారంభోత్సవంలో కమల్‌హాసన్‌ ‘‘సం గీతంతో భారతదేశం మొత్తాన్ని ఏకం చేసిన ఒక గొప్ప శక్తి ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మి అమ్మ. ఆమె సంగీతమే మనం అందుకున్న ఓ గొప్ప సందేశం’’ అన్నారు ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌. ఆయన ముఖ్య అతిథిగా బుధవారం చెన్నైలో ‘ఎం.ఎస్‌ - ఎ లెగసీ ఆన్‌స్క్రీన్‌’ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. ప్రఖ్యాత గాయని, భారతరత్న ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మి జీవిత కథతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆమె 110 జయంతిని పురస్కరించుకుని ప్రారంభించారు. ఆమె పాత్రని ప్రముఖ కథానాయిక రష్మిక పోషిస్తున్నారు. గౌతమ్‌ తిన్ననూరి దర్శకుడు. అల్లు అరవింద్, రాక్‌లైన్‌ వెంకటేశ్, బన్నీ వాస్‌ నిర్మాతలు. అనిరుధ్‌ రవిచంద్రన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి కమల్‌హాసన్‌ క్లాప్‌నిచ్చారు. అనంతరం దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఏడాది కాలంగా మా బృందం మొత్తానికీ సుబ్బులక్ష్మి అమ్మ పేరు ఓ మంత్రంగా మారింది. మధురైలో పుట్టి ప్రపంచం మొత్తాన్ని తన సంగీతంతో అలరించారు. ఆమె జీవితం గురించి అధ్యయనం చేస్తున్నప్పుడు సంగీత కళాకారిణి మాత్రమే కాదని, అసాధారణ జీవితాన్ని చూసిన గొప్ప స్ఫూర్తిదాయకమైన వ్యక్తి అని అర్థమైంది. ఒక వ్యక్తిగా ఆమె జీవితాన్ని తెరపై ఆవిష్కరించబోతున్నాం. ప్రతీ సన్నివేశం ఆమెపై మాకున్న గౌరవభావం, ప్రేమని ప్రతిబింబించేలా ఉంటుంది’’ అన్నారు. కమల్‌హాసన్‌ మాట్లాడుతూ ‘‘ఎన్నో భాషల్లో పాటలు పాడారు ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మి అమ్మ. ఏ భాషలో పాడినా ఆ భాషకే అందం తీసుకొచ్చేవారు. సుప్రభాతం, లలిత సహస్రనామం, రంగపుర విహార పాటలు వింటే మనసు ఆనందంతో నిండిపోతుంది. మహాత్మాగాంధీ కూడా ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మి అభిమాని. ఈ దేశ మహిళల్లో విశ్వాసాన్ని, స్ఫూర్తిని నింపిన సుబ్బులక్ష్మి అమ్మ జీవితంపై సినిమా తీస్తున్న దర్శక నిర్మాతలకు నా శుభాకాంక్షలు. రష్మికని చూస్తే నేను అసూయపడటం లేదు. గడ్డం తీసేసినా నేను ఆమె పాత్రలో నటించి మెప్పించలేను’’ అన్నారు. రష్మిక మాట్లాడుతూ ‘‘నటిగా ఈ గొప్ప అవకాశం నాకు దక్కినందుకు మనసు కృతజ్ఞతతో నిండిపోయింది. దేవుడి సమక్షంలో ఉన్న భావన కలుగుతోంది. సుబ్బులక్ష్మి అమ్మ జీవిత ప్రయాణంలో చిన్న భాగంగా మారుతున్నందుకు ఎంతో గర్వంగా, గౌరవంగా భావిస్తున్నా. అమ్మ పాత్రని అందరికీ నచ్చేలా పోషించేందుకు పూర్తి ప్రయత్నం చేస్తా’’ అన్నారు. అల్లు అరవింద్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాని నిర్మించేందుకు మమ్మల్ని, ఇందులో నటించేందుకు రష్మికనీ సుబ్బులక్ష్మి అమ్మే ఎంచుకున్నారని మాకు అనిపిస్తోంది. ఆమె జీవితంలో ఎదుర్కొన్న సంఘటనల గురించి తెలిశాక ఈ బయోపిక్‌ తీయాలని మరింతగా గట్టిగా నిర్ణయించుకున్నాం. ఆమె పాటించిన క్రమశిక్షణ, నిబంధనలు, చూపించిన ధైర్యం ఎంతో గొప్పవి. ఈ సినిమా కోసం ఏడాదికాలంగా ఎన్నో ప్రదేశాలకు వెళ్లి పరిశోధన చేశారు మా దర్శకుడు. ఈ సినిమాతో అమ్మ సంగీతాన్ని పునః సృష్టించే సాహసం మేం చేయడం లేదు. అనిరుధ్‌ సంగీతంతో ఓ గొప్ప బయోపిక్‌ని నిర్మిస్తున్నాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు సుహాసిని, శివకుమార్, మహేంద్రన్, సముద్రఖని, కలైపులి థాను, రాజేంద్రన్, కాట్రగడ్డ ప్రసాద్, ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మి మనవడు చంద్రశేఖర్, ఆయన సతీమణి మాల తదితరులు పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




